నిరుపేదలకు శుభవార్త,. ఇందిరమ్మ బీమా పథకంతో వారికి రూ.5లక్షల ఆర్ధిక ధీమా.. త్వరలో
తెలంగాణలో పేద కుటుంబాలకు మరో ముఖ్యమైన సంక్షేమ పథకం రాబోతోంది. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి రూ.5 లక్షల బీమా కల్పించే 'ఇందిరమ్మ బీమా' పథకాన్ని నవంబరు 19న ప్రారంభించనున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం పరిధిలోని మండలాల్లో ఆదివారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించి, పరిశీలన చేసిన అనంతరం చింతకాని మండలం నాగులవంచలో బూత్ లెవల్ ఏజెంట్ల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత బీఎల్‌ఏలపై ఉందని సూచించారు. పార్టీ, ప్రభుత్వం ఎప్పుడూ వారికి అండగా ఉంటాయని హామీ ఇచ్చారు. గ్రామ స్థాయిలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఇస్తామని కూడా పేర్కొన్నారు.

'ఇందిరమ్మ బీమా' పథకం ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అయన అన్నారు. ఈ పథకం అమలు కావడంతో అనేక మంది కుటుంబాలకు ఊరట కలుగుతుందని అంచనా.ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి రూ. 5 లక్షల జీవిత బీమా కవరేజ్ అందించటానికి నిర్ణయం తీసుకున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
ఏ కుటుంబం నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రీమియం మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. కుటుంబ ప్రధాన సభ్యుడు, సంపాదించే వ్యక్తి మరణించినప్పుడు బీమా సొమ్ము ఇస్తారు. క్లెయిమ్ చేసిన 10 రోజుల్లోపు నామినీ బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.15 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందే అవకాశం ఉందని సమాచారం.
నవంబరు 19 ఇందిరా గాంధీ జయంతి నాడు ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం కానుంది. భట్టి విక్రమార్క ఈ పర్యటనలో స్థానిక అభివృద్ధి పనులను కూడా సమీక్షించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నవంబరు 19న జరగబోయే ఈ పథక ప్రారంభం రాష్ట్రంలోని పేదలకు మరో ముఖ్యమైన బహుమతిగా నిలవబోతోంది.












Click it and Unblock the Notifications
