E20 Petrol: తిరుగుబాటు మొదలైంది, ఆగస్టు 4న పార్లమెంట్ మార్చ్!
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ రాజధానిలో మరో పెద్ద నిరసన జ్వాల రగిలేలా కనిపిస్తోంది. ప్రస్తుతం పెట్రోల్ బంకుల్లో విక్రయిస్తున్న 'ఈ-20' పెట్రోల్ పై వాహనదారులు, ట్రాన్స్‌పోర్ట్ రంగం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, వాహనదారులకు సాధారణ పెట్రోల్ ఎంచుకునే వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 4వ తేదీన పార్లమెంట్ వైపు భారీ నిరసన ర్యాలీ చేపట్టాలని ఢిల్లీలోని పలు ప్రధాన రవాణా సంఘాలు నిర్ణయించాయి.
ఈ నిరసన కార్యక్రమంపై 'ఢిల్లీ టాక్సీ అండ్ టూరిస్ట్ ట్రాన్స్‌పోర్టర్స్ అసోసియేషన్' అధ్యక్షుడు సంజయ్ సమ్రాట్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ-20 పెట్రోల్ వాడకం వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అయినా చట్టసభల్లో ఉన్న ప్రజాప్రతినిధులు పట్టించుకోకుండా నిద్రపోతున్నారని మండిపడ్డారు. వారందరికీ కళ్ళు తెరిపించడానికే ఈ పార్లమెంట్ మార్చ్ డిజైన్ చేశామని స్పష్టం చేశారు. ఈ పోరాటంలో తమకు ఎలాంటి రాజకీయ రంగుగానీ, రాజకీయ పార్టీల మద్దతుగానీ లేదని.. కేవలం వాహనదారుల హక్కుల కోసమే పోరాడుతున్నామని ఆయన తెగేసి చెప్పారు.

'మాకు ఆప్షన్ ఇవ్వండి'.. రవాణా రంగం సంచలన డిమాండ్!
ఈ పోరాటానికి ఇతర ప్రముఖ రవాణా సంఘాలు కూడా మద్దతు ప్రకటిస్తున్నాయి. 'ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్' అధ్యక్షులు హరీష్ సభర్వాల్, 'ఆల్ ఇండియా మోటార్ అండ్ గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్' ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రభుత్వం బలవంతంగా ఈ-20 ఇంధనాన్ని వాహనదారులపై రుద్దడాన్ని తప్పుబట్టారు. వినియోగదారులకు ఈ-20 తో పాటు సాధారణ పెట్రోల్ వాడేందుకు ఆప్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతానికి ఎలాంటి సమ్మె పిలుపు ఇవ్వలేదని, కానీ ఆగస్టు 4న జరిగే పార్లమెంట్ నిరసన ర్యాలీకి పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు.
వాహనాల ఇంజిన్లకు ముప్పు.. సోషల్ మీడియాలో ఉద్యమం!
గత కొన్ని రోజులుగా ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వాడటం వల్ల వాహనాల మైలేజీ పడిపోతోందని, ఇంజిన్ పార్ట్‌లు త్వరగా పాడవుతున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ-20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా 'ఈ-20 జనతా పార్టీ' పేరుతో పెద్ద ఎత్తున నెటిజన్లు ప్రచారం నిర్వహిస్తూ మద్దతు కూడగడుతున్నారు. సాధారణ ప్రజలు, ట్యాక్సీ డ్రైవర్లు, లారీ యాజమాన్యాలు అందరూ దీనిపై అసంతృప్తితో ఉండటంతో సమస్య తీవ్రరూపం దాల్చింది.
క్లారిటీ ఇచ్చిన సర్కార్.. భవిష్యత్తు ఎటు వైపు?
మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విధానాన్ని సమర్థించుకుంటోంది. ఈ-20 ఇంధనం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని, ఇది పర్యావరణానికి మేలు చేయడంతో పాటు రైతులకు ఎంతో లబ్ధి చేకూరుస్తుందని స్పష్టం చేసింది. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న 20 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని అంతకంటే పెంచే ఆలోచన ఏదీ లేదని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ రవాణా సంఘాలు శాంతించకపోవడం, పార్లమెంట్ మార్చ్‌కి సిద్ధమవ్వడంతో ఆగస్టు 4న ఢిల్లీలో ఏం జరగబోతోందనేది తీవ్ర ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications