గవర్నర్‌కు చంద్రబాబు లేఖ - వేధిస్తున్నారు..!!
గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. టీడీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయిస్తున్నారని లేఖలో ఫిర్యాదు చేసారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు శరత్ అరెస్ట్ విషయాన్ని తన లేఖలో ఆయన వివరించారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పైనా కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. అణచివేయాలన్న ఉద్దేశంతోనే టీడీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని చంద్రబాబు విమర్శించారు.
గవర్నర్ కు రాసిన లేఖలో మాజీ మంత్రి పుల్లారావు కుమారుడు అరెస్ట్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఏపీఎస్ఆర్డీఆర్ఐ దుర్వినియోగాన్ని లేఖలో తెలిపారు. ప్రభుత్వ విభాగాల ద్వారా టీడీపీ నేతలు, కార్యకర్తలపై జగన్ అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఏపీఎస్ఆర్డీఆర్ఐను ప్రతిపక్షాలను వేధించేందుకు ఆయుధంగా ప్రభుత్వం వాడుకుంటోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి విధేయుడైన చిలకల రాజేశ్వరరెడ్డిని ఆ సంస్థకు ప్రత్యేక కమిషనర్‌గా నియమించుకుని టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ ను కేసులో ఇరికించి అరెస్టు చేశారని వివరించారు. శరత్ పనిచేసిన సంస్థలో కేవలం 68 రోజులు మాత్రమే అడిషనల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారన్నారు. అయినా ఏపీఎస్ఆర్డీఆర్ఐ డిప్యూటీ డైరెక్టర్ సీతారామ్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో జరిమానా విధించి విచారణ జరుపుతోందని పేర్కొన్నారు. కేవలం టీడీపీ నేతలను వేధించడమే ఏపీఎస్ఆర్డీఆర్ఐ పనా అంటూ అభ్యంతరం వ్యక్తం చేసారు. ఏపీఎస్ఆర్డీఆర్ఐ ఏర్పడ్డాక రాష్ట్రంలో ఎన్ని కేసులు నమోదు చేసిందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. . ఇలాంటి చట్టవ్యతిరేక పనులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అధికారం దుర్వినియోగం చేసే ప్రభుత్వ చర్యను నిలువరించాలని చంద్రబాబు లేఖలో కోరారు.












Click it and Unblock the Notifications