పెన్షన్ల పెంపు పై చంద్రబాబు సంచలన ప్రకటన..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన ప్రకటన చేసారు. పెన్షన్లను పెంచుతామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్లను రూ 4 వేలకు పెంచుతూ అమలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రతీ నెలా ఒకటో తేదీన స్వయంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కోనసీమలో పెన్షన్లు పంపిణీ చేసిన చంద్రబాబు 64 లక్షల మందికి ప్రతినెల 1వ తేదీనే పెన్షన్లు అందిస్తున్నామన్నారు. పెన్షన్ల పంపిణీ పైన కీలక వ్యాఖ్యలు చేసారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు కాట్రేని కోన మండలం చెయ్యేరులో లబ్ది దారులకు పెన్షన్లు పంపిణీ చేసారు. హామీ ఇచ్చిన ప్రకారం అధికారంలోకి రాగానే పెన్షన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచామని అన్నారు. ఒక రోజు ముందుగానే రాష్ట్రంలో పెన్షన్లు పంపిణీ చేశామని.. ఉపాధి కూలీ లకు పని ప్రదేశాల్లోనే పెన్షన్లు ఇస్తున్నామని అన్నారు. ఇదీ.. పేదల కోసం ప్రభుత్వం పనిచేసే తీరు అని చెప్పుకొచ్చారు. రూ.34 వేల కోట్లు పింఛన్ల కోసం ఇచ్చామని తెలిపారు. దేశంలో ఎక్కడా తమ ప్రభుత్వం ఇచ్చినట్లు పెన్షన్లు ఇవ్వడం లేదని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికా రులు పేదల కోసం ఆలోచించాలన్నారు. భగవంతుడు కనికరిస్తే భవిష్యత్తులో పింఛన్లు పెంచుతా మని ప్రకటించారు. గత వైసీపీ ప్రభుత్వం వితంతు పింఛన్లు ఇవ్వలేదని.. తాము వచ్చాక 71,380 మందికి పెన్షన్ ఇచ్చామని వివరించారు.

ధనిక రాష్ట్రం గా ఉన్న మహారాష్ట్రలో పెన్షన్ రూ. 1000, తెలంగాణలో రూ.2500 మాత్రమే పింఛన్లు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. మూడు నెలల పెన్షన్ ఒకేసారి తీసుకునే అవకాశం ఇచ్చామన్నారు. మెగా డీఎస్సీతో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో 5 లక్షల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఉద్యోగం చేస్తున్నారని తెలిపారు. ఉచిత సిలెండర్ల కోసం నాలుగు నెలలకోసారి అకౌంట్‌లో డబ్బులు జమ అవుతున్నాయన్నారు. రూ.1200 కోట్లతో రాష్ట్రంలో రోడ్లు రిపేర్ చేశామన్నారు. 203 అన్నా క్యాంటీన్లో భోజనం అందిస్తున్నామన్నారు. రూ.1674 కోట్లు పాత ధాన్యం బకాయిలు చెల్లించామని తెలిపారు. నియోజకవర్గంలో 10 వేల సోలార్ కనెక్షన్లు ఏర్పాటు చేయకపోతే ఎమ్మెల్యే పవర్ కట్ చేస్తామని హెచ్చరించారు.
రాయలసీమలో ఎన్నికలు వస్తే బాంబులు అడిగేవారని.. ఇప్పుడు ముఠాలు లేవన్నారు. కోన సీమలో అంబేద్కర్ విగ్రహాలను దెబ్బ తీస్తూ.. విగ్రహాల రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కోనసీమ అనంతపురం కంటే వెనుకబడిపోయిందని అన్నారు. త్వరలో సంక్షేమ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. రేషన్ వాహనాల పేరుతో అరాచకం చేశారని మండిపడ్డ సీఎం.. జూన్ 1నుంచి రేషన్ షాపుల్లో బియ్యం సరఫరా చేయనున్నట్లు తెలిపారు. పేరుకు మాత్రమే డోర్ డెలివరీ అని.. ఆ బియ్యాన్ని అక్కడే తీసుకుని కాకినాడ పోర్టుకి ఎగుమతి చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో మాఫియా చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.












Click it and Unblock the Notifications