సోమిరెడ్డి సీటుకు వేమిరెడ్డి చెక్ - బరిలోకి కొత్త నేత..!!
నెల్లూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరటంతో నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో కొత్తవారికి ఛాన్స్ దక్కుతోంది. నెల్లూరు అర్బన్, రూరల్, ఉదయగిరి, కావలి సీట్లకు చంద్రబాబు ఇప్పటికే అభ్యర్దులను ప్రకటించారు. సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన సీటు తాజాగా చంద్రబాబును కలిసారు. కానీ, ఎంపీగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి సూచన మేరకు సర్వేపల్లిలో కొత్త అభ్యర్ది బరిలోకి దిగటం ఖాయంగా కనిపిస్తోంది.
సర్వేపల్లి పై ఉత్కంఠ : సర్వేపల్లి నుంచి తిరిగి వైసీపీ అభ్యర్దిగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వరుసగా రెండు సార్లు గెలిచిన గోవర్ధన్ రెడ్డి హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇక్కడ ఎవరూ వరుసగా మూడు సార్లు గెలవలేదు. ఈ సారి కాకాణి గెలుస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు. సివి శేషా రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డిలు కేవలం రెండుసార్లు మాత్రమే ఎమ్మెల్యే లుగా గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్న మంత్రి కాకాణి, మాజీ సోమిరెడ్డిల్లో ఎవరు గెలిచినా అదో రికార్డే అవుతుంది.అయితే, టీడీపీ నుంచి సోమిరెడ్డి సీటు దక్కటం కష్టంగా కనిపిస్తోంది. తాజాగా పార్టీ అధినేత చంద్రబాబును కలిసినా సోమిరెడ్డికి సీటు పైన హామీ దక్కలేదు.

టీడీపీ నుంచి నిలిచేదెవరు : తాజాగా వేమిరెడ్డి టీడీపీ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన సూచన మేరకు సీట్ల ఖరారులో మార్పులు జరుగుతున్నాయి. సర్వేపల్లి నుంచి కొద్ది రోజుల క్రితం వరకు ఆనం రామనారాయణ రెడ్డి పేరు రేసులో ఉంది. తాజాగా ఆయనను ఆత్మకూరుకు ఖరారు చేసారు. సర్వేపల్లి నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి తో పాటుగా రూప్ కుమార్ యాదవ్ పేరును పరిగణలోకి తీసుకున్నారు. ఈ ఇద్దరి పేర్లపైన సర్వేలు జరుగుతున్నాయి. ఈ ఇద్దరిలో ఎవరికి సీటు ఇచ్చినా సోమిరెడ్డికి సీటు దక్కే అవకాశం లేదు. వైసీపీలో వేమిరెడ్డి ఉన్న సమయంలో నెల్లూరు సిటీ నుంచి తాను సూచించిన వారికి సీటు ఇవ్వాలని సీఎం జగన్ ను కోరారు. అక్కడ మైనార్టీ అభ్యర్ది ఖలీల్ కు జగన్ కు సీటు ఖరారు చేసారు. టీడీపీ నుంచి మాజీ మంత్రి నారాయణ బరిలో నిలిచారు.
జిల్లాలో హోరా హోరీ : వైసీపీ నుంచి నెల్లూరు ఎంపీ అభ్యర్దిగా సాయిరెడ్డి పోటీ చేస్తున్నారు. తాజాగా నెల్లూరులో ప్రచారం ప్రారంభించారు. కందుకూరుతో సహా పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే వైసీపీ అభ్యర్దులు ఖరారు అయ్యారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆనం, కోటంరెడ్డి ఈ ఎన్నికల్లో గెలవటం ఆ ఇద్దరికి ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ఇప్పుడు వేమిరెడ్డి సర్వేపల్లిలో తాను సూచించిన వారికి సీట్లు ఇవ్వాలని కోరినట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. దీంతో..సర్వే ఫలితాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. 2019లో వైసీపీ జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. దీంతో, ఈ ఎన్నికల్లో టీడీపీ - వైసీపీ జిల్లాలో ఎన్ని స్థానాలు గెలుస్తారు..చివరగా ఎవరెవరు బరిలో నిలుస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications