జగన్ పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు - ఎన్నికల హామీలు..!!
ఏపీలో ఎన్నికల యుద్దం పతాక స్థాయికి చేరింది. అటు జగన్...ఇటు చంద్రబాబు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ప్రజాగళం పేరుతో చంద్రబాబు రాయలసీమలో రోడ్ షోలు ప్రారంభించారు. ఇడుపుల పాయ నుంచి జగన్ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. జగన్ ను టార్గెట్ చేస్తూ...చంద్రబాబు ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావటమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పలు హామీలను ఇస్తున్నారు.
చంద్రబాబు ప్రచారం
తెలుగుదేశం అధినేత చంద్రబాబు తన ఎన్నికల ప్రచారంలో జగన్ ను లక్ష్యంగా చేసుకున్నారు. చంద్రబాబు కుప్పంలో రెండు రోజులు పర్యటించారు. దీని తరువాత తన సొంత జిల్లా నుంచే ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొంటున్నారు. పలమనేరులో రోడ్ షో నిర్వహించిన చంద్రబాబు తమ కూటమి గెలుపు పై ధీమా వ్యక్తం చేసారు. జగన్ 2019లో ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసారని ఆరోపించారు. జగన్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు. దోచుకునే పార్టీ కావాలో.. సంపద సృష్టిచేవాళ్లు కావాలో తేల్చుకోవాలని సూచించారు. పరదాల చాటున తిరిగిన సీఎం జగన్ సిద్ధం అంటూ ప్రజల్లోకి వస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

టార్గెట్ జగన్
జగన్ మోసపూరిత మాటలతో ప్రజలను ఐదేళ్ల పాటు మోసం చేశారన్నారు. రాయలసీమ అభివృద్ధికి జగన్ చేసిందేమి లేదన్నారు. అనంతపురానికి నీళ్లు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనన్నారు. కియా పరిశ్రమను అనంతపురం జిల్లాలో ఏర్పాటయ్యేలా టీడీపీ ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు.రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు దివంగత నేత ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని, ఆ ప్రాజెక్టులను తాను మరింత అభివృద్ధి చేశానని తెలిపారు. నీళ్లు వస్తే పరిశ్రమలు వస్తాయి.. నీళ్లు వస్తే అభివృద్ధి జరుగుతుందని చంద్రబాబు తెలిపారు. 22 నుంచి 23 ఎంపీలు గెలుస్తామని సర్వేల్లో వార్తలు వస్తున్నాయన్నారు. 25 ఎంపీలు గెలవాలనేదే తమ ప్రయత్నం అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

ఛార్జీలు పెంచం
జగన్ సిద్ధం అంటూ మరో మెసపూరిత యాత్రకు వస్తున్నారని.. ఆయనకు ఖాళీ రోడ్లతో స్వాగతం పలకాలని సూచించారు.రాష్ట్ర భవిష్యత్తు మార్చే రోజు మే13వ తేదీ కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారని అన్నారు. ఆరోజుతో రాష్ట్రానికి పట్టిన జగన్ అనే శని వదిలిపోతుందని తెలిపారు. జే బ్రాండ్ మద్యం, గంజాయి నుండి రాష్ట్రానికి విముక్తి కలిగించే రోజు మే 13 అవుతుందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెరగవని హామీ ఇచ్చారు. పెన్షన్ రూ 4 వేలు ప్రతీ నెలా ఒకటో తేదీనే అందిస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications