'బాబుకు మోడీ భయం', పత్తి యంత్రం నడిపిన మంత్రి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోడీని నిధులు, ప్రత్యేక హోదా అడిగే దమ్ము లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు ఆదివారం ధ్వజమెత్తారు. నాడు తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ.. ఇప్పుడు అదే తెలుగువారి గౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెడుతోందన్నారు. విభజన సమయంలో కాంగ్రెస్ ఐదు అంటే వెంకయ్య నాయుడు పది అన్నారని మండిపడ్డారు.
చంద్రబాబుకు మోడీ అంటే భయం: రఘువీరా

రాష్ర్టానికి రావాల్సిన నిధులు తెచ్చేవరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ నుంచి ఏపీకి రావొద్దని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి వేరుగా అన్నారు. ప్రధాని మోడీ అంటే చంద్రబాబుకు అంత భయం ఎందుకో అర్ధం కావడం లేదన్నారు. టీడీపీ, బీజేపీ నేతలు తమ స్వార్థం కోసం రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారన్నారు.
పత్తి తీసే యంత్రాన్ని నడిపిన మంత్రి
గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం బోయపాలెంలో ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆదివారం నాడు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పత్తి తీసే ఆధునిక యంత్రాన్ని స్వయంగా నడిపి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధునిక వ్యవసాయ పరికరాలను రైతులు వినియోగించుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications