ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నవైసీపీ - బీ అలర్ట్ టీడీపీ నేతలతో చంద్రబాబు..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత విదేశాలకు వెళ్లిపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న తిరిగి వచ్చారు. రాష్ట్రంలో ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలకు ఏర్పాట్లు సాగుతున్న నేపథ్యంలో తిరిగి వచ్చిన చంద్రబాబు.. ఇవాళ పార్టీలో కీలక నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో కౌంటింగ్ డే ప్లాన్ పై నేతలతో ఆయన చర్చించారు. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో వైసీపీ మాటల యుద్ధం సాగిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని బాబు సూచించారు.
ఎన్నికల్లో ఎంత అనుకూలంగా ఓటింగ్ పడినా, కౌంటింగ్ లో అప్రమత్తంగా లేకపోవడం వల్ల ఫలితాలు తారుమారు అయిన సందర్భాలు కోకొల్లలు. దీంతో కౌంటింగ్ పై సీరియస్ గా దృష్టిపెట్టాలని నేతల్ని చంద్రబాబు కోరారు. ఇందుకోసం ఎల్లుండి 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజక వర్గాల చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో సమావేశం కావాలని ఆయన నిర్ణయించారు. అలాగే జూన్ 1న జోనల్ స్ధాయిలో కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వబోతున్నారు. ఈ రెండు కార్యక్రమాలు చాలా కీలకమని చంద్రబాబు భావిస్తున్నారు.

అలాగే పోస్టల్ బ్యాలెట్ విషయంలో నెలకొన్న భిన్నాభిప్రాయాలు, అంచనాల నేపథ్యంలో కౌంటింగ్ లో అప్రమత్తంగా ఉండాలని టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఇప్పటికే వైసీపీ విమర్శలకు దిగుతోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు విమర్శల్ని తిప్పికొట్టాలని నేతల్ని చంద్రబాబు ఆదేశించారు. వైసీపీ నేతలు ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. అందుకే ఈసీ, పోలీసులపై విమర్శలు చేస్తున్నారన్నారు.
అటు కౌంటింగ్ రోజు పూర్తిస్దాయిలో బందోబస్తు ఏర్పాటు చేయాలని ఈసీని కోరాలని టీడీపీ నిర్ణయించింది. ఈ మేరకు ఈసీ, డీజీపీకి లేఖ రాయనున్నారు. రాష్ట్రంలో 175 సీట్లకు గానూ, 130 ఎన్నికల పరిశీలకులనే నియమించడం పట్ల చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన నియోజకవర్గాలకూ పరిశీలకుల్ని నియమించాలని ఈసీని కోరనున్నారు. రేపటి నుంచి ఉండవల్లి ఇంట్లోనే ఉంటూ కౌంటింగ్ ప్లాన్ ను చంద్రబాబు పర్యవేక్షించనున్నారు.












Click it and Unblock the Notifications