చంద్రబాబు, లోకేష్ కు కొత్త టెన్షన్-హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్...!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల కోసం హోరాహోరీగా పోరు సాగుతోంది. ఈసారి ఎన్నికల్లో వైసీపీ ఎలాగైనా ఓడించే లక్ష్యంతో విపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్డీయే కూటమిగా జట్టు కట్టాయి. అయితే ఇంత జరుగుతున్నా విపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి నారాయణకు మరో అంశంలో టెన్షన్ పెరుగుతోంది. ఇప్పటికే వారిపై రాష్ట్రంలో నమోదైన కేసుల వివరాలను పోలీసులు ఇవ్వడం లేదు.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు ఎవరైనా నామినేషన్ సందర్బంగా తమపై ఉన్న కేసుల వివరాలను పేర్కొంటూ అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో ఎక్కడైనా తేడా వస్తే పరిశీలనలో నామినేషన్ తిరస్కరించే అవకాశాలుంటాయి. అలాగే తమకు తెలిసీ, తెలియక ఎక్కడైనా కేసులు నమోదైనా ఆ వివరాలు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. తమకు తెలియదన్న కారణంతో కేసుల వివరాలు ఇవ్వకపోతే ప్రత్యర్ధులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తే నామినేషన్లు తిరస్కరిస్తారు.

ఇలాంటి పరిస్ధితుల్లో తమపై రాష్ట్రంలో పోలీసులు, దర్యాప్తు సంస్ధలు నమోదు చేసిన పెండింగ్ కేసుల వివరాలను ఇవ్వాలని వీరు కోరుతున్నా పోలీసు యంత్రాంగం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన వీరు ..ఇంకా వివరాలు రాకపోవడంతో ఇవాళ మరో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చే ఆదేశాలు వీరికి కీలకంగా మారబోతున్నాయి. అలాగే ఇప్పటికే విపక్షాల నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారుల విషయంలో హైకోర్టు ఏం చెప్పబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది.












Click it and Unblock the Notifications