నేడు ఒకే వేదికపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమరనినాదం: ఉమ్మడి అజెండా ప్రకటన!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజాక్షేత్రంలో దూకుడుగా ముందుకు వెళుతున్నాయి. ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో విజయం సాధించి రెండవ దఫా అధికారాన్ని చేపట్టాలని సీఎం జగన్మోహన్ రెడ్డి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో జగన్ ను గద్దె దించాలని అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఉమ్మడి వ్యూహంతో ముందుకు వెళుతున్నారు.
ఇప్పటికే అనేక నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించిన టిడిపి జనసేన కూటమి, ఉమ్మడిగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఇక నేడు తెలుగుదేశం జనసేన భారీ బహిరంగ సభ తాడేపల్లిగూడెం, పత్తిపాడులలో జరగనుంది. ఈ కార్యక్రమంలో ఇరు పార్టీల నుంచి ముఖ్య నేతలు పాల్గొంటారు. ఈ సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని భావిస్తున్న టిడిపి, జనసేన కూటమి సభకు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిగా అభిమానులు కార్యకర్తలు తరలి వచ్చేలా ప్లాన్ చేశారు.

తెలుగు జన విజయకేతనం జెండాగా ఈ సభకు నామకరణం కూడా చేశారు. ఈ సభా వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమ, అభివృద్ధి ఉమ్మడి అజెండాను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించనున్నారు. సీఎం జగన్ తమపై చేస్తున్న విమర్శలకు ఈ సభ ద్వారా ధీటుగా సమాధానం ఇవ్వనున్నారు.
ఇక తెలుగుదేశం, జనసేన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలుగు జన విజయకేతనం జెండా బహిరంగ సభకు రాష్ట్రవ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు రాకుండా ప్రభుత్వం అడ్డు పడుతుందని, బస్సులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందని, అయినా ఆ ఇబ్బందులను అధిగమించి పెద్ద సంఖ్యలో కార్లు, టూవీలర్ ల ద్వారా కార్యకర్తలు, అభిమానులు హాజరుకావాలని తెలుగుదేశం, జనసేన పార్టీ నేతలు కోరుతున్నారు.
తాడేపల్లిగూడెంలో సభ నిర్వహించిన తర్వాత పత్తిపాడు లోను టిడిపి, జనసేన పార్టీల ఉమ్మడి భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఇక్కడ సభలో కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసే పాల్గొంటారు. టిడిపి జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళుతున్న వేళ రెండు పార్టీల అధ్యక్షులు కలిసి భారీ బహిరంగ సభలకు నేటి నుంచి శ్రీకారం చుడుతున్న క్రమంలో దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అన్నది ప్రస్తుతం రెండు పార్టీలలో ఆసక్తికరంగా చర్చ జరుగుతుంది.












Click it and Unblock the Notifications