ఎమ్మెల్యే కొలికపూడిపై చంద్రబాబు కీలక నిర్ణయం..!!
టిడిపి ఎమ్మెల్యే పై సొంత పార్టీ నేతలే రగిలిపోతున్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కు వరుస ఫిర్యాదులు అందుతున్నాయి. మాకు ఎమ్మెల్యే వద్దు అంటూ పార్టీ క్యాడర్ రోడ్ ఎక్కుతుంది. వరుస ట్వీట్లతో కొలికపూడి మరింత వేడి రాజేస్తున్నారు. దీంతో, కీలక నిర్ణయం దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు.
పార్టీకి సమస్యగా
అనూహ్యంగా ఎమ్మెల్యే సీటు దక్కించుకున్న కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలిచిన సమయం నుంచి అన్నింట దూకుడుగా వ్యవహరిస్తున్న కొలికపూడి వ్యవహార శైలి ఇప్పుడు పార్టీకి సమస్యగా మారింది. నియోజకవర్గంలో మట్టి, ఇసుక అమ్ముకుంటున్నారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. వార్తలు రాసిన రిపోర్టర్ ను కొలికపూడి బెదిరింపులకు దిగటం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయం పైన తాజాగా జర్నలిస్టు సంఘాల సైతం ముఖ్యమంత్రిని కలిసి ఫిర్యాదు చేశారు. కొలకపొడి పై చర్యలు తీసుకోవాలని కోరారు.

అధినాయకత్వం సీరియస్
ఇక నియోజకవర్గంలోని చిట్యాల గ్రామపంచాయతీ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావు పై ఎమ్మెల్యే కొలికపుడి చేసిన వ్యాఖ్యలకు మనస్థాపానికి గురైన సర్పంచ్ సతీమణి కవిత ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే తీరు పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత మొదలైంది. సర్పంచ్ కు చిట్యాలలో పేకాట క్లబ్ కు తానే అనుమతి ఇచ్చానని తనకు డబ్బులు ఇవ్వకుండా ఎలా నిర్వహిస్తారు అంటూ ఎమ్మెల్యే అడ్డం తిరిగినట్లుగా ఫిర్యాదులు ఉన్నాయి. అదేవిధంగా కొలికపూడి వరుసగా చేస్తున్న ట్వీట్లను కూడా పార్టీ అధినాయకత్వం సీరియస్ గా పరిగణిస్తోంది. తుఫాను ముందు ప్రశాంతత ఉందంటూ పార్టీని బ్లాక్మెయిల్ చేసే విధంగానే పోస్టింగ్స్ ఉన్నాయని పార్టీ నేతలు సీరియస్ అవుతున్నారు.

మరొకరికి బాధ్యతలు
సొంత పార్టీ నుంచి వ్యతిరేకత వస్తున్న క్రమంలో చంద్రబాబు తిరువూరు ఎమ్మెల్యేను పక్కనపెట్టి మరొకరికి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. తిరువూరు బాధ్యతలను మైలవరం ఎమ్మెల్యే వసంతకు అప్పగించారని పార్టీ నేతల సమాచారం. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న మరో ఎమ్మెల్యేకు నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వడం ద్వారా కొలికపూడిని తప్పించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. అదేవిధంగా ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఇప్పటివరకు కొలికపూడి వ్యవహార శైలి పైన చంద్రబాబు నివేదిక కోరినట్లు సమాచారం. ఇప్పుడు కొలికపూడి ఏ విధంగా స్పందిస్తారు.. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ఆసక్తికరంగా మారుతోంది.
ఇదిలా ఉంటే, తిరువూరు నియోజకవర్గ ఇంఛార్జీగా మైలవరం ఎమ్మెల్యే వసంతకు బాధ్యతలు అప్పజెప్పారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలో నిజం లేదని వసంత కృష్ణప్రసాద్ తేల్చేశారు. అలాంటి వార్తలను ఎవరూ నమ్మొద్దని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications