ఏపీలో ఆటో డ్రైవర్లకు మరో గుడ్ న్యూస్..! చంద్రబాబు కీలక ప్రకటన..!
ఏపీలో ఆటో డ్రైవర్లకు ఏటా 15వేలు ఇచ్చేందుకు ఉద్దేశించి ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని సీఎం చంద్రబాబు ఇవాళ విజయవాడలో ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆటో డ్రైవర్ల కోసం తాము ఎందుకు ఈ పథకం తెచ్చామో వివరించారు. ఇవాళే ఆటో డ్రైవర్లకు 15 వేలు జమ చేస్తున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో ఆటో డ్రైవర్ల కోసం మరో ప్రకటన కూడా చేశారు.
డబ్బులు ఖాతాలో పడ్డాయో లేవో చూసుకోవాలని ఆటోడ్రైవర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. డబ్బులు పడ్డాయంటూ తమ సెల్ ఫోన్లల్లో వచ్చిన బ్యాంక్ మెసేజీలను లబ్దిదారులు చూపించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల కోసం ఉబర్ తరహా యాప్ తెస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆటో డ్రైవర్ల కోసం ఒక యాప్ తయారు చేసి బుకింగ్ లు వచ్చేలా చేస్తామన్నారు. ఆటో స్టాండుకు వెళ్లి పడిగాపులు పడే అవసరం లేకుండా టెక్నాలజీ ద్వారా సహకారం అందిస్తామన్నారు.

ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్ల భవిష్యత్తు కోసం పనిచేస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి యాప్ ద్వారా వారికి అవకాశాలు దొరికేలా చేస్తామన్నారు. ఆటో, మాక్సి క్యాబ్, క్యాబ్ డ్రైవర్లందరికీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మీకు మంచి చేసిన కూటమి ప్రభుత్వం గురించి పది మందికి చెప్పాలని కోరారు.
ప్రజలంతా ఆనందంగా ఉండటమే కూటమికి కావాల్సిందన్నారు.

ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా ఆర్ధిక సాయం డ్రైవర్ల ఖాతాల్లో పడ్డాయని, ఇవాళ ఆటో డ్రైవర్లు, మాక్సీ క్యాబ్, క్యాబ్ డ్రైవర్లకు పండుగని చంద్రబాబు తెలిపారు. గతంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, డబ్బులన్నీ రిపేర్లకే సరిపోయేవి... జరిమానాలు కూడా వేసి వేధించారని గుర్తుచేశారు. 2024లో జరిగిన ఎన్నికలు తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని, 94 శాతం స్ట్రైక్ రేట్ వచ్చిందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలతో ఈ స్ట్రైక్ రేట్ ఇంకా పెరగాలన్నారు. ఏ ఒక్కరికి డబ్బులు జమ కాకపోయినా రిపోర్టు చేస్తే ఆర్హతను బట్టి ఖాతాలో వేస్తామన్నారు.












Click it and Unblock the Notifications