ఏపీలో కొత్తగా 3 కొత్త జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు..! సీఎం ఆమోదం..!
ఏపీలో గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల పునర్ వ్యవస్ధీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. నెల రోజులుగా మంత్రుల కమిటీ ఈ మేరకు చేసిన కసరత్తు పూర్తి కావడంతో సీఎం చంద్రబాబుకు నివేదిక అందింది. దీనిపై రెండు రోజులుగా మంత్రులతో చర్చిస్తున్న సీఎం.. ఇవాళ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో ఐదు కొత్త జిల్లాలు, ఐదు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి.
రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్ వ్యవస్దీకరణ అస్తవ్యస్తంగా ఉండటంతో కూటమి సర్కార్ దాన్ని సరిచేసే ప్రక్రియను ప్రారంభించింది. ఇందుకోసం మంత్రుల కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీ గత నెలలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటించింది. స్దానికంగా అభిప్రాయాలు సేకరించింది. చాలా చోట్ల కొత్త జిల్లాల ఏర్పాటు డిమాండ్లు, జిల్లా కేంద్రాల మార్పు డిమాండ్లు, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు వంటి డిమాండ్లు వచ్చాయి.

అయితే జిల్లాల్ని మరింతగా విడదీస్తే ఇబ్బందులు తప్పవనే భావన వ్యక్తం కావడంతో ఫైనల్ గా కొత్తగా మూడు జిల్లాలు మాత్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం జిల్లాలు కొత్తగా ఏర్పాటు కానున్నాయి. అలాగే ఐదు రెవెన్యూ డివిజన్లను కూడా కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిలో అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకి, కొత్త జిల్లా మదనపల్లెలో పీలేరు, నంద్యాల జిల్లాలో బనగానపల్లె, సత్యసాయి జిల్లాలో మడకశిర డివిజన్లు ఏర్పాటు చేయనున్నారు.

ఈ మేరకు ఇవాళ సచివాలయంలో జిల్లాల పునర్విభజన, డివిజన్లు, మండలాల మార్పు చేర్పులపై సీఎం చంద్రబాబు సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షకు మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, నారాయణ, బీసీ జనార్ధన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటుపై ఇప్పటికే అధ్యయనం చేసిన మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. దీంతో జిల్లాల పునర్ వ్యవస్ధీకరణపై క్లారిటీ వచ్చినట్లయింది.












Click it and Unblock the Notifications