సీఐడీ హెడ్డాఫీస్‌కు హుటాహుటిన చేరుకున్న భువనేశ్వరి, నారా లోకేష్
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించింది. 2014-2019 మధ్యకాలంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటోన్న నేపథ్యంలోచంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.. తగిన సాక్ష్యాధారాలతో సహా.
ఈ తెల్లవారు జామున నంద్యాల పర్యటనలో ఉన్న సమయంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు. సిటీ కోర్ట్‌లో ఆయనను ప్రవేశపెట్టారు. ఈ అరెస్ట్ పట్ల తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు భగ్గుమంటోన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు.

ఈ అరెస్ట్ వ్యవహారంపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగింది. పలువురు మంత్రులు, సీనియర్ నాయకులు చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్నారు. తప్పు చేసిన వ్యక్తికి శిక్ష తప్పదనీ స్పష్టం చేస్తోన్నారు. అధికారంలో ఉన్నప్పుడు వందల కోట్ల రూపాయల మేర ప్రజా ధనాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశాడనే విషయం సాక్ష్యాధారాలతో సహా వెలుగు చూసిందని స్పష్టం చేస్తోన్నారు.
చంద్రబాబును సీఐడీ అధికారులు, పోలీసులు రోడ్డు మార్గంలో నంద్యాల నుంచి విజయవాడకు తీసుకొచ్చారు. ఆయనను మంగళగిరిలోని ఏపీ సీఐడీ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చారు. అక్కడే స్టేట్‌మెంట్‌ను నమోదు చేస్తోన్నారు. విచారణకు చంద్రబాబుకు సహకరించట్లేదనే అభిప్రాయాలు ఉన్నాయి.
చంద్రబాబును సీఐడీ ప్రధాన కార్యాలయానికి తరలించారనే విషయం తెలుసుకున్న వెంటనే ఆయన భార్య నారా భువనేశ్వరి, కుమారుడు, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. చంద్రబాబును కలవడానికి అనుమతి ఇవ్వాలంటూ వాగ్వివాదానికి దిగారు.

భువనేశ్వరి, లోకేష్ వచ్చారనే సమాచారం తెలిసిన వెంటనే గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు సీఐడీ కార్యాలయానికి వచ్చారు. చంద్రబాబును కలవడానికి అనుమతి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి, సీఐడీ అధికారులు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications