ప్రాజెక్టుల ఘనత మాదే-కరెంటు ఛార్జీలు తగ్గిస్తా-సీమలో చంద్రబాబు కామెంట్స్..
రాయలసీమ ప్రాజెక్టుల పర్యటన కోసం నంద్యాల జిల్లా నందికొట్కూరు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. భారీ ఎత్తున తరలివచ్చిన టీడీపీ కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడారు. ముందుచూపుతోనే ప్రాజెక్టులను తెలుగుదేశం చేపట్టిందని చంద్రబాబు తెలిపారు. కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల కోసం చేపట్టిన ప్రాజెక్టు హంద్రీనీవా అన్నారు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని సంకల్పించానని ఆయన గుర్తుచేశారు.
రాయలసీమ కోసం జగన్ ఏనాడైనా పనిచేశారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తి జగన్ అన్నారు. రాయలసీమలో తాము రూ.12,400 కోట్లు ఖర్చుపెట్టామని, రాయలసీమ ద్రోహి ఖర్చుపెట్టింది రూ.2 వేల కోట్లేనన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి ప్రకటించాలని వచ్చానన్నారు. రూ.10 లక్షలకోట్లు అప్పుతెచ్చి.. రాయలసీమకు రూ.2 వేల కోట్లు ఖర్చు పెట్టారని చంద్రబాబు విమర్శించారు.

వైసీపీని భూస్థాపితం చేస్తే తప్ప మనకు న్యాయం జరగదని చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీని భూస్థాపితం చేస్తే తప్ప మనకు న్యాయం జరగదన్నారు. తెలుగుగంగ, ముచ్చుమర్రి ప్రాజెక్టులను టీడీపీనే ప్రారంభించిందని, ఎస్ఆర్‌బీసీ, హంద్రీనీవా ప్రాజెక్టులను టీడీపీనే ప్రారంభించిందన్నారు. నీళ్లు లేని ప్రాజెక్టులు చేసిన ఘనత చరిత్రహీనుడు ఈ సీఎంది అన్నారు. నాలుగున్నరేళ్లలో యువతకు ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
రోడ్డుకు మట్టి వేయలేరుగానీ.. 3 రాజధానులు కడతారట అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఒక రాజధానిని నాశనం చేసి.. 3 రాజధానులంటున్నారన్నారు. మన రాజధాని ఏదంటే చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నామన్నారు. పరదాల మాటున కాదు.. ధైర్యం ఉంటే ప్రజల్లోకి రా జగన్ అని సూచించారు. నందికొట్కూరుకు వచ్చి తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ అయినా జగన్ తీసుకొచ్చారా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఉన్న పరిశ్రమలు కూడా పారిపోయే పరిస్థితి తీసుకొచ్చారన్నారు.

తాము రూ.1,200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, భూమి రూ.5 లక్షలకు కొని రూ.60 లక్షలకు అమ్మడమే వీళ్ల పని అని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ పాలనలో నియోజకవర్గానికి ఒక సైకో తయారవుతున్నారని స్ధానిక వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్ధ్ రెడ్డిని ఉద్దేశించి ఆరోపించారు. రౌడీయిజం చేస్తే తాటతీస్తానన్నారు. వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. పనిచేయని వైసీపీ నాయకులను మురికికాల్వలో ముంచేస్తే బుద్ధి వస్తుందన్నారు. బటన్ నొక్కుతున్నా అని జగన్ పదే పదే చెబుతున్నారని,
బటన్ నొక్కడం కాదు, బటన్ బుక్కుడు ఎక్కువైందన్నారు. పైన రూ.10 పంపిస్తారు.. కింద రూ.90 నొక్కుతున్నారన్నారు.
విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూ పోతున్నారని, ఇప్పటికే 8 సార్లు పెంచారని చంద్రబాబు ఆరోపించారు. కొత్త విద్యుత్ పాలసీ తీసుకొస్తానని హామీ ఇచ్చారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించే బాధ్యత తనదే అన్నారు. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తానన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, యువగళం సూపర్ హిట్ అయింది.. యువతలో చైతన్యం వచ్చిందన్నారు. 20 లక్షల కంటే ఎక్కువే ఉద్యోగాలు ఇస్తామన్నారు. జాబు రావాలంటే బాబు రావాల్సిందేనన్నారు. నాసిరకం మద్యం సరఫరాతో పేదల రక్తం తాగుతున్నారని వైసీపీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. పాత మద్యం విధానం తెచ్చి ధరలు తగ్గిస్తామన్నారు. నాసిరకం మద్యం నుంచి విముక్తి కలిగిస్తామన్నారు.












Click it and Unblock the Notifications