చంద్రబాబు ఆడియో టేప్ లీక్: గవర్నర్‌తో కెసిఆర్, ఎపి ప్రభుత్వం సీరియస్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆడియో టేప్ లీక్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోంది. ఆడియో టేప్ పేరు మీద కుట్ర చేసినవారి అంతు చూస్తామని, కుట్రదారులను జైలుకు పంపిస్తామని ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి పరకాల ప్రభాకర్ హెచ్చరించారు. చంద్రబాబుకు అరెస్టు వారెంటు జారీ చేస్తారంటూ టీ న్యూస్ ప్రసారం చేసింది. టీ న్యూస్ తెలంగాణ పాలక పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)కి చెందిందనే విషయం అందరికీ తెలిసిందే.
ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహాసంకల్ప దీక్ష బహిరంగ సభ తలపెట్టిన నేపథ్యంలో ఈ ఫోన్ సంభాషణను బహిర్గతం చేయడం తెలుగు రాష్ర్టాల్లో పెను దుమారం రేపుతుంది. టేప్ లీకైన వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. మరోవైపు, ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

సీఎస్, డీజీపీ సహా పలువురు అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ఏపీ మంత్రులు కేంద్రానికి ఫిర్యాదు చేయనునన్నట్లు తెలిసింది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ చేయడంపై ఏపీ పోలీసులు సీరియస్‌గా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఎవరెవరు ఉన్నారనే దానిపై విచారణ చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన కేసీఆర్‌పైనే మొదట కేసు పెట్టాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత సీతక్క డిమాండ్ చేశారు. తెలంగాణ ముగింపు వేడుకలను సైతం పక్కన పెట్టి ఇలాంటి దుష్ప్రచార కథనాలు టి.న్యూస్‌లో ప్రసారం చేయడం సరికాదని సీతక్క చెప్పారు.
కాగా, ఆడియో టేప్ ఎక్కడి నుంచి విడుదలైంది, దాని వెనక ఉన్నవారెవరు అనే విషయాలపై చంద్రబాబు ఉన్నతాధికారుల వద్ద ఆరా తీసినట్లు తెలుస్తోంది. తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయనే విషయంపై కూడా ఆయన చర్చించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications