దేశంలోనే టాప్ లో ఏపీ-చంద్రబాబు ప్రకటన-అనంతపురంలో పెన్షన్ల పంపిణీ..!
పెన్షన్ల పంపిణీలో ఏపీ దేశంలోనే టాప్ లో ఉందని సీఎం చంద్రబాబు నిన్న(శనివారం) అనంతపురంలో సగర్వంగా ప్రకటించారు. జిల్లాలోని నేమకల్లులో డిసెంబర్ నెల పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు లబ్దిదారులకు వాటిని అందజేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్ల మొత్తం పెంపు సహా తీసుకున్న పలు నిర్ణయాలను గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్ మొత్తం 4 వేలకు పెంచామని, ఐదు నెలల్లో ఇలా 64 లక్షల మందికి 18 వేల కోట్లు అందజేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అదే సమయంలో ఏదైనా కారణంతో రెండు నెలలు పెన్షన్ తీసుకోకపోయినా మూడో నెల మొత్తం ఒకేసారి తీసుకునే అవకాశం కల్పించామన్నారు. పెన్షన్ లబ్దిదారుల్లో ఉన్న కూలీల్ని, కార్మికుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పెన్షన్ల పంపిణీలో ఎలాంటి అవినీతి ఉండకూడదని ముందే అధికారులకు చెప్పేసినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.

మరోవైపు వెనుకబడిన అనంతపురం జిల్లా అంటే తనకు ఎంతో ప్రేమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఇందులో వెనుకబడిన రాయదుర్గం ప్రాంతాన్ని ఎడారి కానివ్వకుండా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. హంద్రీనీవా ప్రాజెక్టుపై రూ.4500 కోట్లు ఖర్చుపెట్టామని, మొత్తంగా రాయలసీమ ప్రాజెక్టులపై 12 వేల 500 కోట్లు ఖర్చుపెట్టినట్లు తెలిపారు. రాయదుర్గంలోని నేమకల్లు ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత కూడా తమదేనన్నారు. తద్వారా రాయలసీమను రతనాల సీమగా మారుస్తామన్నారు.












Click it and Unblock the Notifications