Rushikonda భవనాల పై చంద్రబాబు కీలక నిర్ణయం..!?
ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ కేంద్రంగా కీలక నిర్ణయాలకు సిద్దమయ్యారు. విశాఖలో మెట్రో కారిడార్ తో పాటుగా ఐటీ ప్రాజెక్టులు.. సంస్థల ఏర్పాటు పైన సమీక్ష చేయనున్నారు. అదే విధంగా రుషికొండ భవనాలను చంద్రబాబు సందర్శిస్తారు. ఈ భవనాల నిర్వహణ భారం పెరుగుతున్న సమంలో వీటి వినియోగం పైన చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది .దీంతో, నేటి చంద్రబాబు విశాఖ పర్యటనలో పలు కీలక ప్రకటనలు ఉండే ఛాన్స్ ఉంది.
విశాఖలో చంద్రబాబు
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నం వస్తున్నారు. జిల్లాలో ప్రధాన శాఖలపైనే శనివారం సమీక్షించనున్నారు. జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ, రెవెన్యూ, భోగాపురం విమానాశ్రయం ప్రధాన అంశాలుగా చేర్చారు. ఇవి కాకుండా మొత్తం 40 శాఖల నుంచి సంక్షిస్త నివేదికలు కోరారు. ఐటీ, పర్యాటకం, రహదారుల నిర్మాణం, తదితర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. రుషికొండపై జగన్ రూ.500 కోట్లతో నిర్మించిన భవనాన్ని ఆయన ఈ సందర్భంగా పరిశీలించే అవకాశం ఉంది. అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ మెట్రో లైన్ గురించి ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రాజెక్టు గురించి నేటి సమీక్షలో అధికారులకు చంద్రబాబు సూచనలు చేయనున్నారు.

ఆ భవనాలను ఏం చేద్దాం
ఇక, రుషికొండ భవనాల పైన అధికారుల నుంచి చంద్రబాబు నివేదిక కోరారు. జగన్ హాయంలో నిర్మించిన ఈ భవనాల పైన రాజకీయంగా దుమారం చెలరేగింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ నేతలు ఈ భవనాలను సందర్శించారు. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ సైతం వీటిని పరిశీలించారు. ఇప్పుడు చంద్రబాబు ఈ పర్యటనలో భవనాల పరిశీలన.. తాజా నిర్వహణ పైన అధికారులతో చర్చించే ఛాన్స్ ఉంది. ఈ భవనాల నిర్వహణ పైన మల్లగుల్లాలు పడుతున్నారు. రుషికొండపై 9.88 ఎకరాల్లో 1,41,438 చదరపు అడుగుల్లో 7 భవనాలు నిర్మించారు. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వాటి నిర్వహణకు రోజువారీ ఖర్చే లక్ష రూపాయలు దాటుతుందని ఇంజినీరింగ్ నిపుణుల అంచనా వేస్తున్నారు. అంటే ఏడాదికి దాదాపు రూ. 4 కోట్ల వరకు అవుతుంది.
చంద్రబాబు నిర్ణయం
ఈ భవనాల నిర్వహణకు ప్లంబింగ్, నీటిసరఫరా, విద్యుత్, ఏసీ టెక్నీషియన్లు, ఉద్యానవన, హౌస్ కీపింగ్‌కు రోజుకు 100 మంది వరకు సిబ్బంది అవసరమని అధికారులు తెలుపుతున్నారు. మరో 50 మంది షిఫ్టుల్లో పనిచేయాలి. వీటిని ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితుల్లో వినియోగించుకోవాలా లేక ప్రయివేటు సంస్థలకు అప్పగించి.. అన్నా క్యాంటీన్లు, సంక్షేమ పథకాలకు వాటి నుంచి వచ్చే నిధులు వినియోగించాలా అనే చర్చ జరుగుతోంది. ఈ భవనాలను ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ - ఏపీటీడీసీకి పూర్తిస్థాయిలో అప్పగించినా ఎలా నిర్వహించాలో అంతు చిక్కట్లేదు. నిర్వహించే సామర్థ్యం, నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరత ఉంది. వీటిని రిసార్టులకు కేటాయించినా అక్కడి నిర్మాణాలు అందుకు తగ్గట్లు లేవు. దీంతో వచ్చే ఆదాయం కన్నా నిర్వహణ తీవ్ర భారమవుతుందని భావిస్తున్నారు. దీంతో, నేడు చంద్రబాబు ఈ భవనాల పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.












Click it and Unblock the Notifications