చంద్రబాబు కు అరుదైన గుర్తింపు : ప్రధాని ప్రశంసలు: ఫలించిన కల..!!
టీడీపీ అధినేత చంద్రబాబుకు అరుదైన గుర్తింపు దక్కింది. 20 ఏళ్ల తరువాత అధికారిక హోదాలో లేకపోయినా ప్రతిష్ఠాత్మక సంస్థ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆహ్వానం అందింది. నాడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు చూపించిన చొరవ ఫలితం ఇప్పుడు ఈ గౌరవానికి కారణమైంది. ఆ సంస్థ గురించి పదే పదే ప్రస్తావించే చంద్రబాబు ఇప్పుడు అక్కడే తన అనుభవాలను పంచుకోనున్నారు. ఇదే సంస్థలో జరిగిన కార్యక్రమానికి కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ హాజరయ్యారు. ప్రశంసించారు. ఇప్పుడు చంద్రబాబు హాజరుతో మరోసారి ఈ అంశం రాజకీయంగానూ చర్చకు కారణమవుతోంది.

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఏర్పడి 20 ఏళ్లు..
హైదరాబాద్ కేంద్రంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఏర్పడి 20 ఏళ్లు పూర్తయింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థ గుర్తింపు దక్కించుకుంది. ఎంతో మంది విద్యార్ధులను ఇక్కడ తీర్చి దిద్దారు. ఈ సంస్థ ఏర్పడి 20 ఏళ్లు పూర్తయింది. గచ్చిబౌలిలో సంస్థ 20వ వార్షికోత్సవ సంబరాలకు ప్రధాని హాజరయ్యారు. ఇప్పుడు ముగింపు వేడుకలకు ప్రత్యేక అతిధిగా టీడీపీ అధినేత చంద్రబాబును ఆహ్వానించారు. చంద్రబాబు ప్రస్తుతం ఎటువంటి అధికారిక హోదాలో లేరు. కేవలం ఏపీలో ప్రతిపక్షనేతగా మాత్రమే ఉన్నారు. కానీ, ఈ సంస్థ ఏర్పాటులో చంద్రబాబు కృషికి గుర్తింపుగా ఆహ్వానించారు. రేపు(శుక్రవారం ) సాయంత్రం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రాంగణంలో జరిగే వేడుకల్లో చంద్రబాబు పాల్గొంటారు. విద్యార్ధులతో ముఖాముఖి పాల్గొంటారు.

ప్రధాని ప్రశంసలు - కలగా పేర్కొన్న చంద్రబాబు..
కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 20వ వార్షికోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ప్రతిష్ఠాత్మక సంస్థ ఐఎస్‌బీ కీలక మైలురాయిని చేరిందన్నారు.ఐఎస్‌బీ విద్యార్థులు అనేక స్టార్టప్‌లు ప్రారంభించారని ప్రశంసించారు. అక్కడి విద్యార్ధుల మీద నమ్మకం ఉందన్నారు. ఈ సంస్థను 2001లో నాటి ప్రధాని వాజ్ పేయి చేతుల మీదుగా హైదరాబాద్ లో ప్రారంభించిన అంశాన్ని నాటి సమావేశంలో ప్రధాని మోదీ గుర్తు చేసారు. నాడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా కృషి చేసిన చంద్రబాబు పేరు ప్రస్తావించలేదు. ఈ సమావేశం తరువాత చంద్రబాబు పార్టీ నేతల వద్ద ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ప్రధాని తన పేరు చెప్పకపోయినా.. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 20వ వార్షికోత్సవం చేసుకుంటూ ఖ్యాతి సంపాదించటం తనకు సంతోషన్ని ఇస్తుందన్నారు.

20 ఏళ్ల నాటి కష్టాన్ని గుర్తు చేసుకుంటూ
ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాడు హైదరాబాద్ కేంద్రంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తీసుకొచ్చేందుకు ఏ విధంగా వ్యవహరించిందీ పలు మార్లు గుర్తు చేసుకున్నారు. నాడు ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్న చంద్రబాబు, నాటి ప్రధాని వాజ్ పేయ్ ను ఒప్పించి అనుమతులు తెచ్చారు. ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానించారు. ఇప్పుడు అదే సంస్థలో చంద్రబాబును ఆహ్వానించటం.. అక్కడ విద్యార్ధులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించటం పైన ఆసక్తి నెలకొంది. నాడు హైదరాబాద్ లో ఉన్న పరిస్థితులు.. తన విజన్ గురించి చంద్రబాబు వివరించనున్నారు. హైదరాబాద్ లో తాను ప్రారంభించిన పలు ప్రాజెక్టులు తరువాతి ప్రభుత్వాలు కొనసాగించిన తీరును చంద్రబాబు పలు సందర్భాల్లో గుర్తు చేసారు. ఇక, ఇప్పుడు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో చంద్రబాబు ఎంట్రీ.. ప్రసంగం పైన ఆసక్తి కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications