నోటుకు ఓటుపై చంద్రబాబు సమాలోచన: ఏం చేద్దాం?
హైదరాబాద్: నోటుకు ఓటు కేసు పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం రాత్రి ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపారు. ఈ పరిణామాలపై ఏం చేద్దామని ఆయన వారితో చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ ఉపకరణాలను, వీడియోలు, ఆడియో క్లిప్లింగ్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది.
కేసుల విచారణలో తదుపరి పరిణామాల గురించి, ట్యాపింగ్ ఎపుడు జరిగిందో, ఎక్కడ ఎలా జరిగిందో అంతర్గత విచారణ వివరాలపై ఆయన ఆరా తీసినట్టు తెలిసింది. ట్యాపింగ్ అంశంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరించే ఎత్తుగడలను కూడా డిజిపి రాముడు, నిఘా విభాగం చీఫ్ అనురాధ ఇతర సీనియర్ అధికారులతో చర్చించారు.
సుమారు రెండు గంటలకు పైగా ఈ సమావేశంలో అనేక అంశాలను చర్చించినట్టు సమాచారం. కేసులో నేరుగా నిందితుడిగా చేర్చే అవకాశాలను, సాక్షిగా పిలిచి కేవలం తెలిసిన సమాచారాన్ని మాత్రమే తీసుకునే పరిస్థితులపై కూడా చంద్రబాబు ఆరా తీసినట్టు తెలిసింది. తదుపరి విచారణలో అనుసరించాల్సిన ఎత్తుగడలతో పాటు రాష్ట్రంలో నిఘా విభాగం పటిష్ట పరచడం, రానున్న కాలంలో ఎలాంటి సవాళ్లనైనా తట్టుకునేలా ముందస్తుగా తీసుకోవల్సిన చర్యలను కూడా చంద్రబాబు చర్చించారు.

సాక్షిగా పరిగణించి నోటీసులు జారీ చేయాలనే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంటే తదుపరి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనేదానిపై కూడా ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను అడిగినట్టు తెలిసింది. కాగా, చంద్రబాబును తెలంగాణ ఎసిబి సాక్షిగా పరిగణిస్తూ సమన్లు జారీ చేసే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలావుంటే, చంద్రబాబు ఈ నెల 26వ తేదీ నుండి విదేశాల పర్యటనకు సన్నద్ధం అవుతున్నట్టు తెలిసింది. దక్షిణ కోరియా, హాంకాంగ్, జపాన్‌లలో పర్యటించాలని ప్రణాళిక వేసుకున్నట్టు తెలిసింది. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి జపాన్ ప్రధానిని ఆహ్వానించనున్నట్టు సమాచారం.
అమరావతి శంకుస్థాపన దసరా రోజున నిర్వహించాలని సిఎం యోచిస్తున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీని కలిసినపుడు కూడా సిఎం ఈ అంశం ప్రస్తావించినట్టు సమాచారం. సింగపూర్, జపాన్ ప్రధానమంత్రులను కూడా శంకుస్థాపనకు ఆహ్వానించాలనే ఆలోచనలో ఉన్నట్టు సిఎం ప్రధానికి వివరించినట్టు తెలిసింది.












Click it and Unblock the Notifications