అధికారంలోకి వస్తే ఏపీ ఎలా ఉంటుందో చెప్పిన చంద్రబాబు
శ్రీసత్యసాయి: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చేస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిని నాశనం చేసిన జగన్ ను ఇంటికి పంపాల్సిందేనని అన్నారు. అమరావతి అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో కేంద్రమంత్రి అమిత్ షాతో పాటుగా నిర్వహించిన భహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు.
అమరావతిని దేశంలోనే నెంబర్ వన్ రాజధానిగా చేసి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. 'జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానుల పేరుతో నాటకాలాడారని.. చివరకు రాజధాని లేకుండా రాష్ట్రాన్ని వదిలేశారని మండిపడ్డారు. రాష్ట్రంలోని అనేక సాగునీటి ప్రాజెక్టులను ధ్వంసం చేశారని చంద్రబాబు.. జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.

జగన్ హయాంలో విచ్చలవిడిగా అవినీతి జరగడంతో పోలవరం ప్రాజెక్టు పట్టాలు తప్పిందని చంద్రబాబు ఆరోపించారు. రాయలసీమ ప్రాంతానికి జగన్ ద్రోహి అంటూ జగన్ మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. తన ఐదేళ్ల పాలనలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు.
ప్రజల భూములు లాక్కున్న అవినీతి స్థానిక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి ధర్మవరం ప్రజలు శాశ్వతంగా గుడ్‌బై చెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పింఛన్ల పంపిణీ పేరుతో 33 మంది మృతికి జగన్ ప్రభుత్వం కారణమైందని, బాధితులకు రూ.10 లక్షలు ఆర్థికసాయం అందించాలని డిమాండ్ చేసినా జగన్ స్పందించలేదని మండిపడ్డారు.
జగన్ మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడి ఆగిపోయిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రధాని మోడీ, అమిత్ షా స్పష్టమైన హామీ ఇచ్చారని, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హంద్రీనీవా, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి రైతుకు సాగునీరు అందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతికి కట్టుబడి ఉన్నామని అమిత్‌షా స్పష్టంగా చెప్పారన్నారు.

మన ఆశలను సైకో జగన్ సర్వనాశనం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితికి జగన్ తీసుకొచ్చారని, అమరావతి నిర్మాణానికి కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. గోదావరి మిగులు జలాలను చివరి భూములకూ అందిస్తామన్నారు. గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారన్న చంద్రబాబు.. కేంద్రం ఇచ్చిన డబ్బులివ్వకుండా రైతులను జగన్ మోసం చేశారని మండిపడ్డారు.
ప్రతి రైతుకు రూ.20 వేలకంటే పైగానే వారి ఖాతాల్లో వేస్తామన్నారు చంద్రబాబు. రైతును రాజుగా చేసే బాధ్యత టీడీపీ ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. బిందు, తుంపర సేద్యం తీసుకొస్తామని పేర్కొన్నారు. సమర్థ నాయకత్వం ఉండి కేంద్ర సహకారం తీసుకుంటే ఏపీ అభివృద్ధి సాధ్యమన్నా చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ తీసుకురాలేదని దుయ్యబట్టారు.
ఉద్యోగాలు లేక నిరుద్యోగులు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. ఏటా 4 లక్షలు చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. లేదంటే ఉద్యోగం వచ్చేవరకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తామని, యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం తీసుకొస్తామన్నని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications