నలుగురితో చర్చలు: స్పీకర్ పదవిపై బాబు కసరత్తు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ పదవిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు. స్పీకర్‌గా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై ఆయన చర్చలు జరిపారు. అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభం కానున్న నేపథ్యంలో స్పీకర్ పదవికి నాయకుడిని ఎంపిక చేసే పనిలో ఆయన పడ్డారు.
చంద్రబాబుతో కోడెల శివప్రసాదరావు, ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి, కాల్వ శ్రీనివాసులు, కళా వెంకట్రావులతో చంద్రబాబు సమావేశమయ్యారు. వీరిలో ఒకరిని స్పీకర్ పదవికి, మరొకరిని డిప్యూటీ స్పీకర్ పదవికి ఎంపిక చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. మంత్రి పదవులు దక్కకపోవడంపై సీనియర్ శాసనసభ్యులైన కోడెల శివప్రసాదరావు, ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి అసంతృప్తితో ఉన్నారు.

కోడెల శివప్రసాదరావు గానీ ధూళిపాళ్ల గానీ స్పీకర్ పదవి చేపట్టేందుకు సుముఖంగా లేరనే మాట వినిపిస్తోంది. కాల్వ శ్రీనివాసులును స్పీకర్ అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. కళా వెంకట్రావు కూడా సీనియరే కావడంతో డిప్యూటీ స్పీకర్ పదవికి అంగీకరిస్తారా అనేది సమస్యగా మారింది.
కాగా, సంప్రదాయాల ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షమైన తమకు ఇవ్వాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అంటోంది. బిజెపికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారా అనేది కూడా తెలియడం లేదు. బిజెపి మంత్రివర్గంలో చేరిన నేపథ్యంలో ఆ పదవిని ఇవ్వకపోవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications