ఎందుకంత ముచ్చటపడ్డారు? : టీడీపీ నేతలపై ముచ్చటపడ్డ చంద్రబాబు
గుంటూరు : టీడీపీ నేతల శిక్షణ శిబిరంలో ఉత్సాహంగా కనిపిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సాంకేతికతను అందిపుచ్చుకునే విషయంలో టెక్ విద్యార్థులు చెబుతోన్న పాఠాలను తమ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆసక్తిగా వింటుండడం చూసి ఆయనకు చాలా ముచ్చటేస్తోందట. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబే వెల్లడించారు.
అమరావతికి సమీపంలో ఉన్న కేఎల్ యూనివర్సిటీలో జరుగుతోన్న నాయకత్వ సాధికారిక సదస్సు రెండో రోజులో భాగంగా కంప్యూటర్ ల్యాబ్ లో డ్యాష్ బోర్డు, కైజాలా యాప్ పై పార్టీ నేతలకు శిక్షణ ఇచ్చారు సీఎం. టెక్ విద్యార్థులు చెబుతోన్న సాంకేతిక పాఠాలను నేతలు ఆసక్తిగా వినడం.. సందేహాలను నివృత్తి చేసుకోవడం చూస్తోంటే తనకు చాలా ముచ్చటేస్తోందని చెప్పారు.
టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ సాగిపోతే ప్రపంచం మన ముందున్నట్టేనని అభిప్రాయపడ్డ చంద్రబాబు.. ఈరోజుల్లో టెక్నాలజీతో అప్ డేట్ కాకపోతే అవుట్ డేట్ అయిపోతామని తెలిపారు. తమ పార్టీ నేతలకు సాంకేతిక పాఠాలను చెప్పించడంలో తాను విజయవంతమయ్యానని పేర్కొన్నారు. ప్రతీ నేత నిత్య విద్యార్థి లాంటి వాడేనని, నేర్చుకోవడమనేది నిరంతరం జరుగుతూ ఉండాలని సూచించారు.

ఇక నూతన ఆవిష్కరణల గురించి ప్రస్తావిస్తూ.. ప్రస్తుత యుగంలో నూతన ఆవిష్కరణలదే ప్రధాన పాత్ర అని, ఒక ఆలోచన ప్రపంచ గతిని మార్చేస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇదే తరహాలో తాను అవలంభించిన విధానాల గురించి చెబుతూ.. భూగర్భం ద్వారా చేపడితే రూ. 3 వేల కోట్ల ఖర్చయ్యే ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును, తన ఆలోచనతో విద్యుత్ స్తంభాలపై వేయించి రూ. 300 కోట్లతోనే పనులు పూర్తయ్యేలా చేశామని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు.
రాష్ట్రంలో ఉన్న విపక్షాలు అభివృద్ధి నిరోధకంగా వ్యవహరిస్తున్నాయంటూ మండిపడ్డ చంద్రబాబు.. వర్షాభావ పరిస్థితుల్లో ఎండిపోయే పంటలకు తడి అందించేందుకు రెయిన్ గన్ లను ప్రవేశపెట్టిన విషయాన్ని కూడా ఈ సందర్బంగా ప్రస్తావించారు.












Click it and Unblock the Notifications