చంద్రబాబు మెసేజ్ క్లియర్ ! ఆ అధికారులకు మరిన్ని కష్టాలు..?
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విపరీతమైన స్వామిభక్తి ప్రదర్శించి విపక్షాలకు కంటగింపుగా మారిన అఖిల భారత సర్వీసు అధికారులకు (ఐఏఎస్, ఐపీఎస్ లు) ప్రభుత్వం మారడంతో చుక్కలు కనిపిస్తున్నాయి. గత ఐదేళ్లలో ఓ రేంజ్ లో తమ హవా కొనసాగించిన వీరంతా భవిష్యత్తుపై ఎలాంటి ఆందోళనా లేకుండా చెలరేగిపోయారు. ఇప్పుడు వీరందరికీ చంద్రబాబు రాకతో తత్వం బోధపడుతున్న పరిస్ధితి. దీంతో వారు తీవ్ర విపత్కర పరిస్ధితులు ఎదుర్కొంటున్నారు.
చంద్రబాబు కనుసైగతో సెలవుపై వెళ్లిపోయిన సీఎస్ జవహర్ రెడ్డి నుంచి మొదలుపెడితే గతంలో సీఎంవోలో పనిచేసి ఇప్పుడు పోస్టింగ్ లేని మాలకొండయ్య, రేవు ముత్యాలరాజు, నారాయణ భరత్ గుప్తా, ప్రస్తుతానికి పోస్టుల్లో ఉన్నప్పటికీ ప్రాధాన్యత లేని ప్రవీణ్ ప్రకాష్, శ్రీలక్ష్మి వంటి ఐఏఎస్ లు, ఈసీ బదిలీ చేసిన మాజీ ఇంటెలిజెన్స్ ఛీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, చంద్రబాబు ప్రభుత్వం బదిలీ చేసి పోస్టింగులు ఇవ్వని కొల్లి రఘురామిరెడ్డి వంటి వారికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి.

తాజాగా ఐఏఎస్, ఐపీఎస్ లతో భేటీ అయి మరీ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వైసీపీ అనుకూల ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు శరాఘాతంలా మారబోతున్నాయి. నిన్నటి భేటీలో కొందరు వైసీపీ అనుకూల అధికారులు ఇచ్చిన బొకేలు సైతం తీసుకునేందుకు చంద్రబాబు నిరాకరించారని వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే భవిష్యత్తులో వీరిని మరిన్ని కష్టాలు చుట్టుముట్టబోతున్నాయి. ఇప్పటికే ప్రాధాన్య పోస్టింగులు కరవైన వీరంతా భవిష్యత్తులో రాష్ట్రం వదిలి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ఎదురుచూడాల్సిన పరిస్ధితులు రాబోతున్నాయని చెప్తున్నారు.
సీఎంగా బాధ్యతలు చేపట్టగానే వ్యవస్థల ప్రక్షాళనంపైనే దృష్టిసారిస్తామని చెప్పేసిన చంద్రబాబు అన్నట్లుగానే వీరి పోస్టింగులపైనే దృష్టిపెట్టబోతున్నారు. వైసీపీ మాట విని విపక్షాలను ఐదేళ్లుగా ఇబ్బందుల పాలు చేసిన అఖిల భారత సర్వీసు అధికారుల జాబితా తెప్పించుకుని అనంతరం ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలు చేపట్టబోతున్నారు. త్వరలో ఈ జాబితా ఖరారవుతుందని సచివాలయ వర్గాల సమాచారం. నిన్నటి భేటీలో వైసీపీ అనుకూల అధికారులు ఆత్మసమీక్ష చేసుకోవాలని చెప్పిన చంద్రబాబు.. వారికి మారేందుకు అవకాశం ఇస్తారా లేక పూర్తిగా పక్కనబెట్టేస్తారా అన్నది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications