సేఫ్ సైడ్‌గా కుప్పంతో పాటు అత్తవారింటి జిల్లా నుంచీ చంద్రబాబు పోటీ: జోరుగా ప్రచారం
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త నియోజకవర్గాన్ని ఎంచుకుంటారనే ప్రచారం ఊపందుకుంది. తన సామాజిక వర్గానికి చెందిన ఓటుబ్యాంకు అధికంగా ఉన్న కృష్ణా జిల్లా నుంచి పోటీ చేయాలనే ఒత్తిడి ఆయనపై పెరిగిందని తెలుస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా కుప్పంతో పాటు కృష్ణా జిల్లాలో- ఖచ్చితంగా గెలిచి తీరుతాననే ధీమా ఉన్న నియోజకవర్గం నుంచి కూడా అసెంబ్లీ ఎన్నికల బరిలో చంద్రబాబు దిగాలనేది ఆ ప్రచారం సారాంశం.

కుప్పం గెలుపుపై సడలిన ధీమా..
తెలుగుదేశం పార్టీ నాయకుల్లో చంద్రబాబు ఇక కుప్పంలో గెలుస్తారనే ధీమా సడలినట్టే కనిపిస్తోంది. గ్రామ పంచాయతీలు మొదలుకుని మున్సిపాలిటీ దాకా నిర్వహించిన అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయింది. కనీసం గట్టిపోటీ కూడా ఇవ్వలేకపోయింది. చంద్రబాబు ఏడు దఫాలుగా ప్రాతినిథ్యాన్ని వహిస్తూ వస్తోన్న ఈ నియోజకవర్గంలో ఈ తరహా పరిస్థితులను ఇదివరకు ఎప్పుడూ చవి చూడలేదు టీడీపీ. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇవే ఫలితాలు వెలువడ్డాయి.

అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం..
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడం వల్ల అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. కుప్పం అభివృద్ధిపై ఖచ్చితంగా దృష్టి సారిస్తుంది. చంద్రబాబు హయాంలో చోటు చేసుకోలేని అభివృద్ధిని ఈ రెండున్నరేళ్ల కాలంలో చేసి చూపిస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి. సంక్షేమ పథకాల అమలు తీరును మరింత విస్తృతం చేయడం, కొత్త లబ్దిదారులను చేర్చడం వంటి కార్యక్రమాలు చేపడుతుందని, చంద్రబాబు అవసరం లేదనే అభిప్రాయాన్ని కుప్పం ఓటర్లలో కలిగిస్తుందనివ అంటున్నారు.

ఇప్పటికే రాజకీయాలకు అతీతంగా సంక్షమ పథకాలు..
ఇప్పటికే ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా కుప్పంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు సైతం పథకాలు అందుతున్నాయి. ప్రభుత్వ సేవలన్నింటినీ సచివాలయాల వ్యవస్థ ద్వారా వారి ఇళ్ల వద్దకు చేర్చుతోంది. ఇవన్నీ కళ్లకు కనిపించే పనులు కావడం, వాటి ద్వారా లబ్దిపొందిన తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల కుటుంబాలు కూడా ఈ దఫా వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారనే ప్రచారం సాగుతోంది.

కొత్త నియోజకవర్గం కోసం..
ఈ పరిణామాలన్ని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులను పునరాలోచింపజేస్తోన్నాయని అంటున్నారు. అందుకే- కుప్పాన్ని వీడాలని, కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేయక తప్పకపోవచ్చనే అభిప్రాయాన్ని టీడీపీ నేతల్లో కలిగించిందని చెబుతున్నారు. లేదా రెండు చోట్లా పోటీ చేసే అవకాశం ఉండటం వల్ల ముందు జాగ్రత్త చర్యగా కుప్పంతో పాటు మరో నియోజకవర్గాన్ని కూడా ఎంచుకోవాలని అభిప్రాయపడుతున్నారు. 2024 అసెంబ్లీలో చంద్రబాబు ప్రాతినిథ్యం తప్పనిసరిగా అవసరమౌతుందని అంటున్నారు.

కృష్ణాజిల్లా నుంచి పోటీ..
ఈ దఫా చంద్రబాబు నాయుడు తన సొంత జిల్లాతో పాటు అత్తవారింటి జిల్లా కృష్ణా నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటుబ్యాంకు బలంగా ఉన్న స్థానాన్ని ఆయన ఎంచుకుంటారని సమాచారం. పెనమలూరు లేదా అవనిగడ్డ నుంచి 2024 నాటి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగే అవకాశాలను టీడీపీ నాయకులు పరిశీలిస్తున్నారని చెబుతున్నారు. కుప్పంతో పాటు పెనమలూరు లేదా అవనిగడ్డ నుంచి పోటీ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.
Recommended Video

వైసీపీ చేతిలో..
ప్రస్తుతం పెనమలూరు, అవనిగడ్డ నియోజకవర్గాలు వైెఎస్ఆర్సీపీ చేతిలో ఉన్నాయి. పెనమలూరు నుంచి మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, అవనిగడ్డ నుంచి సింహాద్రి రమేష్ కుమార్ వైసీపీ తరఫున గెలిచారు. అసెంబ్లీకి ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. 2014లో ఈ రెండు స్థానాలను టీడీపీ కైవసం చేసుకున్న విషయం తెలిసింద. పెనమలూరు నుంచి బోడె ప్రసాద్, అవనిగడ్డ నుంచి మండలి బుద్ధప్రసాద్ విజయం సాధించారు. పెనమలూరు నియోజకవర్గం పరిధిలోకి వచ్చే కంకిపాడు, ఉయ్యూరు, పెనమలూరుల్లో కమ్మ సామాజిక వర్గం ఓటుబ్యాంకు బలంగా ఉందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications