సౌకర్యాలు బాగున్నాయా?: వెలగపూడి మహిళా ఉద్యోగులతో బాబు మాటా మంతి

Subscribe to Oneindia Telugu

అమరావతి: 'తాత్కాలిక సచివాలయంలో వసతులు ఎలా ఉన్నాయి? మీకు బస ఎక్కడ ఏర్పాటు చేశారు? భోజనం రుచికరంగా ఉంటోందా? ఏవైనా సమస్యలు ఉంటే చెప్పండి? ఎవరూ ఇబ్బందులు పడకుండా చూసుకుంటాం' అంటూ వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం ఐదవ బ్లాకులో ఏర్పాటైన శాఖల ఉద్యోగులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడారు.

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో నిర్మిస్తున్న సచివాలయ భవనాలను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం పరిశీలించారు. ముందుగా ఐదో నంబర్‌ భవనంలోని కింది అంతస్తులో ఉద్యోగుల కోసం చేసిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.

chandrababu

గురువారం నుంచి పూర్తిస్థాయిలో ఉద్యోగులు రానున్న నేపథ్యంలో వారికి కల్పించిన సౌకర్యాలపై అధికారులతో చర్చించారు. మిగతా భవనాల నిర్మాణాల పురోగతిపై సీఆర్‌డీఏ అధికారులతో సమీక్షించారు.

అక్కడి ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి ఐదో భవనం కింది అంతస్తు మొత్తం కలయదిరిగారు. ఏర్పాట్లన్నీ సంతృప్తికరంగా ఉన్నాయని, ఇక్కడికి రావడానికి రహదారులే సరిగ్గా లేవని కొందరు ఫిర్యాదు చేయగా, ఆ సమస్యా త్వరలోనే తీరిపోతుందని చంద్రబాబు అభయమిచ్చారు.

అరకొరగా మిగిలివున్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, మిగతా భవనాలన్నింటినీ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

చంద్రబాబుతో పాటు మంత్రులు దేవినేని ఉమ, కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, తదితరులు ఉన్నారు. గత నెలాఖరులో వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం ప్రారంభమై కొన్ని శాఖలు వచ్చిన తర్వాత చంద్రబాబు పర్యటించడం ఇదే మొదటిసారి.

ఆగస్టు నాటికి పూర్తి స్థాయి తరలింపు: హైదరాబాద్‌లోనూ ఉద్యోగులు

ఆగస్టు చివరి నాటికి సచివాలయ ఉద్యోగులను పూర్తి స్థాయిలో వెలగపూడి కార్యాలయానికి తరలించడం జరుగుతుందని చంద్రబాబు అన్నారు. అప్పటి వరకు వెలగపూడిలో సచివాలయ నిర్మాణం పూర్తయిపోతుందని చెప్పారు.

అంతేగాక, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి ఉద్యోగులందరినీ పూర్తిగా అమరావతికి షిఫ్ట్ చేయబోవడం లేదని సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. కొంతమందిని అక్కడే ఉంచుతామని తెలిపారు. ఎవరెవరిని అక్కడే ఉంచాలన్న విషయమై మార్గదర్శకాలు రూపొందిస్తామని పేర్కొన్నారు. వ్యక్తిగత ఇబ్బందులు ఉన్నవారు, వయసు పెరిగి పదవీ విరమణకు దగ్గరైన వారు, మానవీయ కోణంలో పరిశీలించి ఎంపిక చేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని వివరించారు.

మొత్తం ఉద్యోగుల్లో 5 నుంచి 10 శాతం మాత్రమే హైదరాబాద్‌లో కొనసాగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మిగతావారంతా అమరావతికి వచ్చేస్తారని చంద్రబాబు తెలియజేశారు.

'నాకు తెలుసు. ఉద్యోగులంతా మనసుకు సర్దిచెప్పుకుని, స్థిమితపరచుకుని ఇక్కడికి వచ్చారు. గుడ్ థింగ్. మీకెవరికీ ఇబ్బంది రానీయను. సమస్యలన్నీ పరిష్కరిస్తాను. ఇక్కడికి వచ్చిన ఉద్యోగులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వారు మంచి స్ఫూర్తితో ముందుకు వచ్చారు. ఇక్కడున్న ఉద్యోగులు వారితో సోదరభావంతో మెలగాలి. వారికి స్వాగతం పలకడం శుభసూచకం' అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.

'అల్టిమేట్‌గా ఆగస్టు నాటికి మొత్తం స్టెబిలైజ్ అవుతుంది. సాంప్రదాయ ఆఫీసులా కాకుండా, వర్చ్యువల్ ఆఫీసులుగా తీర్చిదిద్దుతున్నాం. రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ ఆన్‌లైన్ చేస్తాం. ఫైల్స్ రియల్ టైంలో టేబుల్స్ మారేలా ఏర్పాట్లు చేస్తున్నాం. దీని వల్ల పని సులభం అవుతుంది" అని పేర్కొన్నారు.

శీతాకాల సమావేశాలు ఇక్కడే

శీతాకాలపు అసెంబ్లీ సమావేశాలను అమరావతిలోనే నిర్వహిస్తామని, ఈ మేరకు తాను ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్టు చంద్రబాబు వివరించారు. ఈలోగా మంచి రహదారుల నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. అధికారుల మధ్య సమన్వయ బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించినట్టు తెలిపారు.

వెలగపూడిలో ప్రస్తుతం నిర్మిస్తున్న భవనాల్లో సచివాలయాన్ని తాత్కాలికంగా మాత్రమే ఏర్పాటు చేస్తున్నామని, ఈ భవనాలు అమరావతిలో తొలి భవనాలుగా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో మరింత బెస్ట్ బిల్డింగులు కట్టుకోవాల్సి ఉందని, అందుకు టైమ్ పడుతుంది కాబట్టి, త్వరితగతిన పూర్తయ్యేలా ఈ భవనాలను నిర్మించాలని తాను ఆలోచించినట్టు వెల్లడించారు.

ప్రస్తుత భవంతులను రాబోయే రోజుల్లో ఇతర అవసరాలకు ఉపయోగించుకుంటామని తెలిపారు. అమరావతిలో సచివాలయం ప్రపంచ స్థాయి నాణ్యతతో, వన్నాఫ్ ది బెస్ట్ గా ఉంటుందని చంద్రబాబు తెలిపారు. ఇప్పటికి భవనాల పనులు మొదలై 136 రోజులైందని, ఇంత రికార్డు సమయంలో పనులను తామెప్పుడూ చేయలేదని స్వయంగా ఎల్అండ్ టీ, షాపూర్ జీ పల్లోంజీ సంస్థలు తనకు తెలిపాయని చెప్పుకొచ్చారు.

ఐటి కంపెనీల్లానే..

ఐటీ కంపెనీల్లో ఉండేలా, ఏసీల నుంచి అన్ని మౌలిక వసతుల వరకూ ఇక్కడ పనిచేసే వారికి కల్పించనున్నామని చంద్రబాబు అన్నారు. ఆగస్టు చివరికి పూర్తి సచివాలయం ఇక్కడే ఉంటుందని, ఏ కొద్ది మందో తప్ప, అందరూ వచ్చేశారని తెలిపారు. ప్రారంభ దశ కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయని చంద్రబాబు అన్నారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని సమస్యలు ఉంటాయని, పనిలోకి దిగితేనే అవి ఏంటన్నవి తెలుస్తుందని తెలిపారు. దేశంలోనే తొలిసారి ఈ ఆఫీసులను తెరిచింది మనమేనని చంద్రబాబు చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu on Monday met employees in Velagapudi.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X