ఇక్కడా ఊడ్చేయాలి: బాబు, దేవుడే చెప్తాడు: జగన్
హైదరాబాద్/ న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ తరహాలో రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని ఊడ్చేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం రంగారెడ్డి చేవేళ్ల నియోజక వర్గంలోని పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ప్రజలకు చెందాల్సిన సంక్షేమ పథకాల నిధులను కాంగ్రెస్ నేతలు స్వాహా చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రజలకు తక్కువ ధరకు నిత్యావసర వస్తువులు అందించేందుకు తమ ప్రభుత్వ హయాంలో రైతు బజార్లు ప్రవేశపెడితే... కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతు బజార్లను దళారీ వ్యవస్థగా మార్చిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వచ్చే ఎన్నికల్లో దొంగలను తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజల కష్టాలు తీరాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఒక్కటే మార్గమని ఆయన స్పష్టం చేశారు.
విభజన ప్రజాస్వామ్యానికి విఘాతం: జగన్
ప్రభుత్వం చిత్తమొచ్చినట్లు రాష్ట్రాలను విభజిస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఆరోపించారు. ఈ విధంగా రాష్ట్రాలను విభజించుకుంటూ పోతే.. దీనికి అంతం ఎక్కడ ఉంటుందని ఆయన ప్రశ్నించారు. విభజనల వల్ల ప్రజాస్వామ్య విధానాలకు విఘాతం కలుగుతుందని జగన్మోహన్ రెడ్డి అన్నారు. లోకసభ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయని, కాంగ్రెసుకు దేవుడే బుద్ధి చెప్తాడని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications