ఎన్నికల వేళ.. చంద్రబాబుకు బిగ్ ట్రబుల్
Chandrababu Naidu: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన అనంతరం ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అధికార వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం- జనసేన- బీజేపీ కూటమి ఎత్తుకు పైఎత్తులు వేస్తోన్నాయి. ఎన్నికల్లో విజయం సాధించడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి.
ఈ పరిస్థితుల్లో- తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చిక్కుల్లో చిక్కుకున్నారు. న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వస్తోందాయనకు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించాల్సిన ఈ అత్యంత కీలక సమయంలో నోటీసులను అందుకోవడం కలకలం రేపుతోంది.

తెలుగుదేశం సోషల్ మీడియా విభాగం ప్రతినిధులు ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై వైఎస్ఆర్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వేసిన పోస్టింగులు దీనికి కారణం అయ్యాయి. టీడీపీ ఆధీనంలో ఉన్న అన్ని విభాగాల అధినేతగా ఆయనకు ఈ నోటీసులు అందాయి.
వైఎస్ఆర్సీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా.. ఈ నోటీసులను జారీ చేశారు. 24 గంటల్లోగా వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా చేసిన పోస్టింగులన్నింటినీ తొలగించాలని ఆదేశించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై ఇలాంటి పోస్టింగులు పెట్టడం ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందని తెలిపారు.
జగన్‌పై చేసిన పోస్టింగులపై వైఎస్ఆర్సీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్‌ను వ్యక్తిగతంగా విమర్శిస్తూ అనేక రకాల పోస్టులు పెట్టారని ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఓ వినతిపత్రాన్ని అందజేశారు. దీనిపై స్పందించిన మీనా ఈ నోటీసులను జారీ చేశారు.












Click it and Unblock the Notifications