ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై ఆ నిర్ణయం
Free bus travel for Women in APSRTC: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మధ్య జరిగిన సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ప్రత్యేకించి విభజన సమస్యల పరిష్కారం, నదీ జలాల పంపిణీ, ఏపీలోని పోర్టులు, టీటీడీలో తెలంగాణకు వాటాపై చర్చించారు.
ఏపీ విడిపోయి 10 సంవత్సరాలు పూర్తయినా విభజన సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కావట్లేదని, దీనిపై రెండు వైపుల నుంచి అత్యున్నత స్థాయి కమిటీలు వేయాలని నిర్ణయించారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల అధ్యక్షతన ఈ కమిటీలు రెండు వారాల్లోగా మనుగడలోకి వస్తాయి.

మరో ముగ్గురు చొప్పున అధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు. అప్పటికీ విభజన సమస్యలను పరిష్కరించుకోవడానికి అవసరమైన మార్గాలు కనిపించకపోతే రెండు రాష్ట్రాల మంత్రులతో మరో కమిటీ వేసి పరిష్కరించాలని నిర్ణయించారు. మాదక ద్రవ్యాలు, గంజాయికి వ్యతిరేకంగా రెండు రాష్ట్రాలు సంయుక్తంగా యాంటీ నార్కొటిక్స్ డ్రైవ్స్ నిర్వహించాలని ఉమ్మడిగా తీర్మానించారు. సైబర్ క్రైమ్‌ను అరికట్టడానికీ ఈ రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటాయి.
తెలంగాణలో ప్రస్తుతం అమలులో ఉన్న ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు తీరుపై చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. తాము అధికారంలోకి వస్తే ఏపీలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తామంటూ చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో ఈ పథకం కార్యరూపం దాల్చింది. ఏపీలో మాత్రం ఇంకా అమలు కావట్లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కావస్తోన్నప్పటికీ- దీని ఊసే ఎత్తట్లేదు. ఈ నేపథ్యంలో- దీని అమలు గురించి చంద్రబాబు.. రేవంత్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. దీనిపైనా కమిటీ వేసే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications