ఏడ్చేసిన మంత్రి..! చంద్రబాబు ఫోన్ కాల్..! ఏం చెప్పారంటే ?
ఏపీలో జిల్లాల పునర్ విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారం స్వయంగా అధికార కూటమిలోనే చిచ్చుపెట్టింది. కొంతకాలంగా జిల్లాల పునర్ విభజనతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు స్వీకరించడంతో పాటు వాటిపై ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేసిన ప్రభుత్వం ఎట్టకేలకు తాజాగా వీటిపై నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఇవాళ కేబినెట్ భేటీలో ఆమోదించారు. దీంతో రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లా కాస్తా మదనపల్లె జిల్లాగా మారబోతోంది.
ఇవాళ అమరావతి రాజధానిలో జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేయడంతో అక్కడే ఉన్న రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కన్నీరుపెట్టుకున్నారు. దీంతో సీఎం చంద్రబాబు ఆయన్ను ఓదార్చారు. ఈ వ్యవహారం అక్కడితో ఆగలేదు. కేబినెట్ భేటీ నుంచి బయటికి వచ్చాక కూడా మరోసారి మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. కేబినెట్ నిర్ణయంపై స్పందించేందుకు సైతం ఆయన నిరాకరించారు. మీడియా ప్రశ్నలకు సమాధానం కూడా ఇవ్వకుండానే వెళ్లిపోయారు.

దీంతో సీఎం చంద్రబాబు తన కేబినెట్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఫోన్ కాల్ చేసినట్లు తెలుస్తోంది. రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లాను తీసేసి మదనపల్లె జిల్లా ఏర్పాటు వల్ల తలెత్తే పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. అయితే ఈ సందర్భంగా రాయచోటికి ఎలాంటి అన్యాయం జరగకుండా తాను చూస్తానని మంత్రి మండిపల్లికి చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అభివృద్ధి పరంగా రాయచోటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం. దీనిపై మంత్రి మండిపల్లి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications