వైఎస్ జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు కీలక నిర్ణయం
స్కిల్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న చంద్రబాబు దాదాపు 53 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైలులో గడిపారు. దీంతో కొద్దిరోజులుగా ఆ పార్టీ సభలు, సమావేశాలు నిలిచిపోయాయి. బాబుకు కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. జిల్లాల పర్యటనకు వెళ్లేలా చంద్రబాబు ప్రణాళిక రూపొందించుకున్నట్లు తెలుస్తోంది.
పంచాయతీరాజ్ వ్యవస్థను వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, సర్పంచ్ లను ఉత్సవ విగ్రహాలుగా మార్చడంపై రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. ఏపీ సర్పంచ్ ల సంఘం, ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ ఆధ్వర్యంలో ఇవి జరగనున్నాయి. ఈనెల 10న శ్రీకాకుళం, 11న కాకినాడ, 14న నరసరావుపేట, 15న కడప జిల్లాల్లో ఇవి జరగనున్నాయి. పార్టీలకు అతీతంగా సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలను ఆహ్వానిస్తున్నారు. చంద్రబాబు మళ్లీ ప్రజల్లోకి వస్తుండటంతో పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

రెగ్యులర్ బెయిల్ లభించిన తర్వాత చంద్రబాబు తిరుమల వెంకటేశ్వరస్వామిని, విజయవాడలో కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేయనున్నారు. పార్లమెంటు సమావేశాలు జరిగే సమయంలోనే ఢిల్లీ వెళ్లనున్నారు. డిసెంబరు 6వ తేదీ నుంచి 8వ తేదీ లోపు తనకు సమయం కేటాయించాలంటూ సీఈసీకి లేఖ రాయనున్నారు. రేపు సింహాచలం నరసింహస్వామివారిని చంద్రబాబు దర్శించుకోనున్నారు.












Click it and Unblock the Notifications