Kurnool Bus Accident: కర్నూలు బస్సు ఘటనతో అలర్ట్- చంద్రబాబు కీలక ఆదేశాలు..!
ఏపీలోని కర్నూలులో ఈ తెల్లవారు జామున చోటు చేసుకున్న బస్సు ప్రమాదం దేశవ్యాప్తంగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఒడిశా నుంచి వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కాలిపోతున్న దృశ్యాలు అందరినీ కదిలించాయి. ఈ ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు గాయాలతో బయటపడటంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ ఘటనకు కారకుల్ని గుర్తించే పనిలో బిజీగా ఉంది. మరోవైపు విదేశీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు.. కర్నూలు ప్రమాదంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కర్నూలు బస్సు ప్రమాదంపై రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు.. కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాల రవాణామంత్రులతో కూడా మాట్లాడి సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశాలిచ్చారు. అదే సమయంలో బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాల్ని తక్షణం ఆదుకోవాలని మంత్రి మండిపల్లికి సూచించారు. అసలు ఈ ఘటనకు కారకుల్ని గుర్తించి శిక్షించాలని, అస్సలు వదలొద్దని సీఎం ఆదేశించారు.

మరోవైపు కర్నూలు బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో రాష్ట్రంలో ప్రైవేటు బస్సులపై ఫిట్ నెస్, భద్రత, తనిఖీలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లో తనిఖీలు చేపట్టాలని రవాణా మంత్రిని ఆదేశించారు. కర్నూలు బస్సు ప్రమాదంలో నిర్లక్ష్యమే కారణమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరికలు జారీ చేశారు. దీంతో అధికారులు బాధ్యుల్ని గుర్తించే పనిలో ఉన్నారు.

ఇప్పటికే బస్సు ప్రమాదం జరిగిన ఘటనకు చేరుకున్న ఫోరెన్సిక్ బృందాలు ఆధారాల్ని సేకరించే పనిలో ఉన్నాయి. తాజా పరిస్ధితిపై ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబుకు అధికారులు అప్ డేట్ అందిస్తున్నారు. బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఇవాళ పరిహారం ప్రకటించే అవకాశం ఉంది. అలాగే ఆస్పత్రుల్లో ఉన్న వారికి మెరుగైన చికిత్స అందించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం ఆదేశాలు ఇస్తోంది.












Click it and Unblock the Notifications