ఆటోల్లో చంద్రబాబు, పవన్, లోకేష్ ప్రయాణం-15 వేల పథకం ప్రారంభం వేళ..!
ఏపీలో ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15 వేల రూపాయల చొప్పున సాయం అందించే అటో డ్రైవర్ల సేవలో పథకం ఇవాళ ప్రారంభం కాబోతోంది. కాసేపట్లో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి ఈ పథకం ప్రారంభిస్తారు. అంతకంటే ముందే సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ స్వయంగా ఆటోల్లో ప్రయాణాలు చేశారు. విజయవాడ నగరంలో వారు ఆటోల్లో ప్రయాణం చేస్తున్న దృశ్యాలు ఇవాళ కనిపించాయి.
ఉదయం సీఎం చంద్రబాబు, పవన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఉండవల్లి నుంచి ఆటోల్లో ఈ పథకం ప్రారంభించే సింగ్ నగర్ కు బయలుదేరి వెళ్లారు. వీరికి ఉండవల్లి వద్ద మంగళగిరి చేనేత కండువాలు కప్పి మంత్రి నారా లోకేష్ ఘనస్వాగతం పలికారు. వీరికి మద్దతుగా పెద్ద ఎత్తున మంగళగిరి ప్రజలు తరలివచ్చారు. వీరిందరినీ లోకేష్ ఆత్మీయంగా పలకరించారు. బాణాసంచా, తీన్ మార్ డప్పులతో మంగళగిరి యువత సందడి చేశారు.

విజయవాడ సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 'ఆటో డ్రైవర్ సేవలో' పథకాన్ని సీఎం చంద్రబాబు ఇవాళ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థికసాయం అందించే 'ఆటో డ్రైవర్ సేవలో' పథకo ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, మాధవ్ పాల్గొంటారు. ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కింద 15 వేల ఆర్థిక సాయం అందించనుంది.

ఒక్కో డ్రైవర్‌కు ఏడాదికి 15 వేలు చొప్పున ఆర్థికసాయం అందుతుంది. తొలి ఏడాది 2,90,669 మంది డ్రైవర్లకు రూ.436 కోట్ల మేర వారి ఖాతాల్లో జమ చేస్తారు.ఆటో డ్రైవర్లు 2.64 లక్షల మంది, ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు 20,072 మంది, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు 6,400 మందికి లభ్ది కలుగుతుంది. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకం నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు నష్టం కలుగకుండా ప్రభుత్వం ఈ పథకం కింద వారిని ఆదుకోనుంది.












Click it and Unblock the Notifications