రాజ్ భవన్లో ఎట్ హోంకు చంద్రబాబు, పవన్ డుమ్మా-జగన్ తోనే సరిపెట్టిన గవర్నర్ !
ఏపీలో రిపబ్లిక్ డే సందర్భంగా ఇవాళ గవర్నర్ నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరు కాగా.. విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ డుమ్మా కొట్టారు.
ఏపీలో ప్రతీ ఏటా రిపబ్లిక్ డే సందర్భంగా రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులకు గవర్నర్ మర్యాదపూర్వకంగా ఇచ్చే ఎట్ హోం కార్యక్రమం ఈసారి కూడా రాజకీయ విభేదాలకు సాక్షిగా నిలిచింది. ఈ కార్యక్రమానికి రావాలని సీఎం జగన్ తో పాటు విపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు గవర్నర్ హరిచందన్ ఆహ్వానాలు పంపారు. అయితే జగన్ మాత్రమే హాజరయ్యారు.
ఇవాళ సాయంత్రం విజయవాడ రాజ్ భవన్లో నిర్వహించిన గవర్నర్ ఎట్ హోమ్ కార్యక్రమానికి సీఎం జగన్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఎప్పటిలాగే సీఎం జగన్ తన సతీమణి వైఎస్ భారతితో కలిసి హాజరయ్యారు. గవర్నర్ దంపతులతో కలిసి ఆయన విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్, సీఎం దంపతులు ఆహ్లాదంగా మాట్లాడుకున్నారు.

మరోవైపు గవర్నర్ ఎట్ హోం కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానం అందినా విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దూరంగా ఉండిపోయారు. గతేడాది ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు ఈసారి మాత్రం దూరంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఎప్పటిలాగే ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. రేపు తనయుడు నారా లోకేష్ పాదయాత్ర ఏర్పాట్లలో బిజీగా ఉండటం వల్లే చంద్రబాబు గవర్నర్ ఎట్ హోం కార్యక్రమానికి రాలేదని తెలుస్తోంది. అటు పవన్ కళ్యాణ్ విజయవాడలోనే ఉన్నా గవర్నర్ ఎట్ హోంకు రాలేదు. దీంతో విపక్ష నేతలు లేకుండానే గవర్నర్ సీఎం జగన్ తో కలిసి ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.












Click it and Unblock the Notifications