Kinjarapu Atchannaidu:టెక్కలికి అచ్చెన్నాయుడు గుడ్ బై..కారణం ఇదే..!!
ఏపీ రాజకీయాల్లో శ్రీకాకుళం జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. ఆ జిల్లా నుంచి ఎంతో మంది రాజకీయ ఉద్దండులు చట్టసభల్లో తమ మార్కును చూపించారు. అలాంటి వారిలో ముందుగా గుర్తొచ్చేది దివంగత నేత ఎర్రన్నాయుడు, ఆ తర్వాత ఆయన సోదరుడు ప్రస్తుత మంత్రి అచ్చెన్నాయుడు. ఇక ఎర్రన్నాయుడి వారసుడిగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తన సత్తా చాటుతున్నాడు. ఇక శ్రీకాకుళం జిల్లాలో మరో రాజకీయ వారసుడు అరంగేట్రం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆయన గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నట్లు సమాచారం.
వైయస్ సునామీలో కూడా..
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం. ఒకటి రెండు సార్లు తప్పితే అది ఎప్పటికీ టీడీపీకి కంచుకోటగానే నిలిచింది. ఇక్కడి నుంచి ప్రస్తుతం అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే తన రాజకీయ అరంగేట్రం మాత్రం 1996లో హరిశ్చంద్రాపురం ఉపఎన్నిక గెలవడం ద్వారా జరిగింది. అనంతరం హరిశ్చంద్రాపురంలోని కొన్ని మండలాలు టెక్కలి నియోజకవర్గంలో కలవడంతో ఇక అప్పటి నుంచి అచ్చెన్నాయుడు టెక్కలినే హోంగ్రౌండ్‌గా చేసుకుని బరిలో దిగుతూ వచ్చారు. 1999 ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసి గెలిచిన అచ్చెన్నాయుడు ఆ తర్వాత 2004లో కూడా విజయదుందుభి మోగించారు. 2004లో వైయస్ సృష్టంచిన సునామీలో కూడా అచ్చెన్నాయుడు గెలిచాడంటే అక్కడ ఆయన పట్టు ఎలా ఉందో నిరూపితమైంది.

హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా...
2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ రెండవ సారి అధికారంలోకి వచ్చింది. తొలిసారిగా టెక్కలి నియోజకవర్గం నుంచి ఓటమిపాలయ్యారు.అయినా సరే కృంగిపోలేదు. ప్రజాసమస్యలపై పోరాడుతూ టెక్కలి నియోజకవర్గ ప్రజలకు మళ్లీ చేరువయ్యారు. దీంతో 2014లో మళ్లీ ప్రజలు అచ్చెన్నకు పట్టం కట్టారు.దీంతో చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా అవకాశం దక్కింది. ఎంతో మంది సీనియర్లను కాదని అచ్చెన్నపై ఇంకా చెప్పాలంటే ఎర్రన్నాయుడి కుటుంబంపై చంద్రబాబు తన అభిమానాన్ని చాటుకున్నారు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ గాలిని తట్టుకుని అచ్చెన్న బరిలో నిలిచి గెలిచాడు. అసెంబ్లీలో తన గొంతును వినిపించాడు. 2024లో మరో సారి గెలిచిన అచ్చెన్నాయుడు హ్యాట్రిక్ విజయం సాధించాడు.దీంతో మళ్లీ మంత్రి పదవి దక్కించుకున్నారు.
వారసుడికి వెల్కమ్
ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.అయితే ఇప్పుడు అచ్చెన్నాయుడు తన పొలిటికల్ కెరీర్ పై ఆలోచనలో పడ్డట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 2029 ఎన్నికల్లో అచ్చెన్నాయుడు తన కుమారుడైన కృష్ణమోహన్ నాయుడును బరిలో దింపి తద్వారా తనకు పొలిటికల్ కెరీర్‌ను వారసత్వంగా ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం గ్రౌండ్ వర్క్ కూడా భారీగా చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కృష్ణమోహన్ నాయుడు కూడా టెక్కలి నియోజకవర్గంలో చాలా యాక్టివ్‌గా తిరుగుతూ ప్రజాసమస్యలను అడిగి తెలుసుకుంటున్నట్లు వినికిడి. తన కొడుకు కోసం అచ్చెన్నాయుడు వచ్చే ఎన్నికల బరిలో నుంచి తప్పుకునేందుకు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.ఇక టీడీపీ కూడా కొత్త వారికి లేదా యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని యోచిస్తోంది. మంత్రి లోకేష్ కూడా ఇదే ఫార్ములాకు కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే 2029 ఎన్నికలకు టెక్కలి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా కింజారపు కృష్ణ మోహన్ నాయుడు రేసులో ఉంటారని ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ కృష్ణ మోహన్ నాయుడు టెక్కలిలో పలు పార్టీ కార్యక్రమాలకు హాజరవుతూ.. ప్రజలతో మమేకం అవుతున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే 2029లో అచ్చెన్న వారసుడిగా కృష్ణమోహన్ నాయుడు ఎంట్రీ ఖాయమనే తెలుస్తోంది. ఇప్పటికే కింజారపు రామ్మోహన్ నాయుడు తనదైన శైలిలో రాజకీయం చేస్తుండగా.. ఇక మరో యువనాయకుడు కృష్ణమోహన్ నాయుడు కూడా తోడైతే శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications