రామ్మోహన్ కు కీలక శాఖ, పెమ్మసానికి ప్రమోషన్ - ఏపీ నుంచి మరో మంత్రి..ఆయనకే ఛాన్స్..!!
కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు కసరత్తు కొనసాగుతోంది. మూడో సారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అవుతున్న వేళ ప్రధాని మోదీ ప్రభుత్వం - పార్టీ పరంగా కీలక మార్పుల దిశగా ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగా పలువురు సీనియర్ మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించాలని డిసైడ్ అయ్యారు. బీహార్ మాజీ సీఎం నితీశ్ కు మంత్రి పదవి దక్కనుంది. టీడీపీ నుంచి కేంద్ర కేబినెట్ లో ఉన్న ఇద్దరు మంత్రులకు శాఖలు మారే ఛాన్స్ కనిపిస్తోంది. అదే సమయంలో ఏపీకి మరో కేంద్ర మంత్రి పదవి దక్కనున్నట్లు సమాచారం.
కేంద్ర కేబినెట్ ప్రక్షాళనలో భాగంగా పెద్ద సంఖ్యలో మంత్రులను తప్పించేందుకు రంగం సిద్దం అయినట్లు తెలుస్తోంది. ఈ రోజు కేబినెట్, స్వతంత్ర, సహాయ మంత్రులతో ప్రధాని మోదీ కీలక భేటీ ఏర్పాటు చేసారు. పలువురు మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారు. మిత్రపక్షాల కు చెందిన మంత్రుల శాఖల్లోనూ మార్పులు జరగనున్నాయి. అందులో భాగంగా టీడీపీ నుంచి ప్రస్తుతం కేబినెట్ మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు విమానయాన శాఖ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు రామ్మోహన్ ను ఆ శాఖ నుంచి తప్పించి కీలక శాఖ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గతంలో రామ్మోహన్ తండ్రి ఎర్రంనాయుడు నిర్వహించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు ఉపాధి కల్పన శాఖలను ఇప్పుడు అప్పగిస్తారని అంచనా వేస్తున్నారు. ఎర్రంనాయుడు 1996 నుండి 1998 వరకు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో హెచ్‌డి దేవెగౌడ ఐకె గుజ్రాల్ మంత్రివర్గాలలో పనిచేశారు. ఇప్పుడు రామ్మోహన్ కు కీలక శాఖ దాదాపు ఖాయమైంది. అదే విధంగా మరో మంత్రి పెమ్మసానికి ప్రాధాన్యత పెరగనుంది.

ప్రస్తుతం పెమ్మసాని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఆయన కు ప్రస్తుత ప్రక్షాళనలో స్వతంత్ర శాఖ ఇవ్వనున్నారని సమాచారం. టూరిజం శాఖను పెమ్మసాని కి అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక.. ఏపీ నుంచి కూటమికి కేంద్ర మంత్రివర్గంలో మరో పదవి దక్కనుంది. జనసేనకు ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేకపోవటంతో... ఆ పార్టీకి ఈ సారి విస్తరణలో అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అయితే.. టీడీపీ నుంచి అవకాశం వస్తే అమలాపురం ఎంపీ గంటా హరీష్ కు అవకాశం దక్కుతుందని అంచనా. బీజేపీకి మరో మంత్రి పదవి ఇవ్వాలని డిసైడ్ అయితే సీఎం రమేశ్ రేసులో ఉన్నారు. ప్రాంతీయ - సామాజిక సమీకణాల ఆధారంగా మరో మంత్రి పదవి ఖరారు కానుంది. ఈ రోజు కేబినెట్ లోని 72 మంది మంత్రులతో ప్రధాని సమావేశం కానున్నారు. అందరూ ఢిల్లీలో అందుబాటులో ఉండాలని స్పష్టం చేసారు. దీంతో.. కీలక మార్పుల దిశగా నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications