Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్- ఈ నెలలోనే- రెండే స్టాప్ లు..!
ఏపీ మీదుగా దేశంలోని పలు ప్రధాన ప్రాంతాల్ని, స్టేషన్లను కలుపుతూ ఇప్పటికే పలు ప్రీమియర్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇదే క్రమంలో తాజాగా మరో ప్రీమియర్ రైలును ఏపీ మీదుగా నడిపేందుకు భారతీయ రైల్వే సిద్దమవుతోంది. ఇప్పటికే దేశంలో ఒక వందే భారత్ స్లీపర్ రైలు రాకపోకలు సాగిస్తోంది. ఇప్పుడు మరో వందే భారత్ స్లీపర్ రైలును అందుబాటులోకి తెస్తోంది. ఈ దసరాకు ప్రారంభించే ఈ రైలు ఏపీ మీదుగా రాకపోకలు సాగించబోతోంది.
బెంగళూరు-ముంబై మధ్య కొత్తగా వందే భారత్ స్లీపర్ రైలును (Vande Bharat Sleeper) నడపాలని రైల్వే శాఖ ఇప్పటికే నిర్ణయించింది. కేఎస్ఆర్ బెంగళూరు-ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ మధ్య ఈ వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెలలో ప్రారంభించే అవకాశం ఉంది. ఈ రైలు అందుబాటులోకి వస్తే బెంగళూరు నుంచి ముంబైకు 16 గంటల్లోనే చేరుకునే అవకాశం ఉంది. టైమ్‌టేబుల్ ప్రకారం ఈ రైలు బెంగళూరు నుంచి రాత్రి 10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1:50 గంటలకు ముంబై చేరుకునే అవకాశం ఉంది. తిరుగు ప్రయాణంలో ముంబై నుంచి రాత్రి 10:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2:50 గంటలకు బెంగళూరు చేరుకునే అవకాశం ఉంది. అయితే ఈ సమయాలను రైల్వే శాఖ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఏపీ మీదుగా రాకపోకలు సాగించే ఈ వందే భారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్ రైలుకు రాష్ట్రంలో రెండు స్టాప్ లు మాత్రమే ఇచ్చారు. రాయలసీమలోని అనంతపురం, గుంతకల్ స్టాపుల్ని ఇందుకు ప్రతిపాదించారు. ఈ రైలు తన ప్రయాణంలో అనంతపురం, గుంతకల్, రాయచూర్, కలబురగి, సోలాపూర్, పుణే, కల్యాణ్ స్టేషన్లలో ఆగనుంది. ఈ సర్వీస్‌ను వారానికి ఆరు రోజులు నడిపేలా ప్లాన్ చేస్తున్నారు. బెంగళూరు నుంచి బయలుదేరే సర్వీస్ సోమవారం, ముంబై నుంచి బయలుదేరే సర్వీస్ అందుబాటులో ఉండవు. ఈ మార్గంలో రెండు వందే భారత్ స్లీపర్ రేక్‌లను ఉపయోగించనున్నారు. ఈ రైలు ప్రారంభ సర్వీసును ముందుగా స్పెషల్ ట్రైన్‌గా నడిపి, అనంతరం రెగ్యులర్ సర్వీస్‌గా మార్చే అవకాశం ఉంది. ప్రస్తుతం బెంగళూరు-ముంబై మధ్య రోజువారీ రైలు ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ ఉంది. ఇది సుమారు 1,134 కి.మీ. దూరాన్ని దాదాపు 22 గంటల్లో చేరుకుంటోంది. వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి వస్తే ఈ సమయం భారీగా తగ్గనుంది.














Click it and Unblock the Notifications
