మంత్రి రోజాను ర్యాగింగ్ చేసిన చంద్రబాబు..జబర్దస్త్ షోను లాగి మరి
టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీనిలో భాగంగా నగరి నియోజకవర్గం పుత్తూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. నగరి మీటింగ్ చూసిన తరువాత జగన్ మైండ్ బ్లాక్ అవుతుందని చంద్రబాబు అన్నారు. ఏపీని డ్రగ్స్, భూ కబ్జాలకు అడ్డాగా మార్చారని విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ముద్దులు పెట్టాడని.. ఇప్పుడు ప్రజలను బాదుడే బాదుడు అంటూ బాదేస్తున్నాడని జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు విరుచుకుపడ్డారు.
మీ ఉత్సాహాన్ని చూస్తుంటే రాష్ట్రానికి మళ్లీ మంచి రోజులు వచ్చినట్టుగా అనిపిస్తుందని.. వచ్చే ఎన్నికల్లో కూటమి గెలుపును ఎవరు కూడా అడ్డుకోలేరని చంద్రబాబు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని..కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పారాయన. ఎవరికీ భయపడవద్దని, గేమ్ స్టార్ట్ అయిందని వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదే అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇదే సమయంలో నగరి ఎమ్మెల్యే మంత్రి రోజాపై కూడా చంద్రబాబు సెటైర్లు వేశారు.

ఆమెను జబర్దస్ ఎమ్మెల్యే అని పేర్కొంటూ నగరికి ఆమె ఏమీ చేయలేదని అన్నారు. ఆమె మోసాలకు పాల్పడుతోందని చెప్పారు. రోజాకు డబ్బులు పంచుకోవడమే పని అంటూ విమర్శించారు.భువనేశ్వరి అనే మహిళకు మున్సిపల్ ఛైర్మన్ పదవి ఇస్తామని నలభై లక్షల రూపాయిలు లంచం తీసుకున్నారని రోజాపై చంద్రబాబు ధ్వజం ఎత్తారు. నగరిలో ఇసుక, గ్రావెల్ , భూ దందాలతో రోజా అడ్డదిడ్డంగా దోచుకున్నారని చంద్రబాబు విమర్శలు చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ నాయకుల అవినీతి చిట్టా బయటకు తీస్తామని చంద్రబాబు హెచ్చరించారు.
తాము అధికారంలోకి వస్తే చేనేత కార్మికులకు 500 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. నగరిలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఏపీ కోసమే బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిశాయని తెలిపారు. ఇందులో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని కాకుండా, రాష్ట్ర ప్రయోజనాల కోసమే కలిసి ముందుకు వెళుతున్నామని అన్నారు. నగరి అభ్యర్థిగా గాలి భాను ప్రకాష్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని నగరి ప్రజలను చంద్రబాబు కోరారు.












Click it and Unblock the Notifications