బీజేపీ సీనియర్లకు చంద్రబాబు-పురందేశ్వరి షాక్ ! పంతం నెగ్గించుకున్నారా ?
ఏపీలో టీడీపీ మూడో జాబితా ఇవాళ విడుదలైంది. 13 మంది ఎంపీ అభ్యర్ధులతో పాటు 11 మంది అసెంబ్లీ అభ్యర్ధుల పేర్లను ఇందులో విడుదల చేశారు. అయితే అసెంబ్లీ అభ్యర్ధుల విషయంలో పెద్దగా చర్చ లేకపోయినా తొలిసారి విడుదల చేసిన ఎంపీ అభ్యర్ధుల జాబితాలో మాత్రం పలు సంచలనాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పలు చోట్ల కొత్త ముఖాలకు చోటు దక్కింది. అలాగే వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన నేతలకూ ఎంపీలుగా సీట్లు దక్కాయి.
అంతే కాదు బీజేపీ నుంచి ఎంపీలుగా సీట్లు ఆశించిన పలువురు సీనియర్లను టీడీపీ మూడో జాబితా తీవ్రంగా నిరాశపరిచింది. ముఖ్యంగా విశాఖ ఎంపీ సీటు ఆశించి మూడేళ్లుగా అక్కడే పనిచేసుకుంటున్న మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఏలూరు ఎంపీ సీటు ఆశించిన గారపాటి చౌదరి, ఏలూరు లేదా విజయవాడ ఎంపీ సీటు ఆశించిన సుజనా చౌదరి, హిందూపురం సీటు ఆశించిన విష్ణువర్ధన్ రెడ్డి, పరిపూర్ణానంద, అనకాపల్లి లేదా విశాఖ సీటు ఆశించిన సీఎం రమేష్..ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు చాంతాడంత ఉంది.

వీరంతా బీజేపీలో కొన్నేళ్లుగా స్ధిరంగా పనిచేసుకుంటున్న వారే. అలాగే లోక్ సభ అభ్యర్ధులుగా పోటీ చేసేందుకు కొంతకాలంగా ఏర్పాట్లు చేసుకున్న వారే. చివరికి టీడీపీతో పొత్తు కుదిరిన తర్వాత కూడా ఆయా సీట్లు వారికే దక్కతాయని ఆశించారు. కానీ ఈ సీట్లను బీజేపీకి ఇస్తే కూటమి ఓడిపోవడం మినహా పెద్దగా ఒరిగేదేమీ లేదని చంద్రబాబు భావించారు. ఇదే విషయాన్ని బీజేపీకి చెప్పి నచ్చజెప్పారు. వీటికి బదులుగా మరో ఆరు సీట్లను వారికి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో బీజేపీ కూడా సరేనని చెప్పక తప్పలేదు.












Click it and Unblock the Notifications