ప్రాణాలు లెక్క చేయను: బాబు, ఆయన లేఖతోనే: డిగ్డీ
న్యూఢిల్లీ: రాష్ట్రానికి న్యాయం జరగడమే ముఖ్యమని, అందుకు తన ఆరోగ్యాన్ని లెక్క చేయనని, ప్రాణాలను కూడా లెక్కచేయనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలోని ఆంధ్రా భవన్‌లో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ఆయన మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనపై జాతీయ స్థాయిలో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల జెఎసిలను పిలిచి చర్చలు జరపాలని కూడా ఆయన కోరారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెసు పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో, వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కయిందని ఆయన విమర్శించారు రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు సోనియా గాంధీ పాట్లు పడుతున్నారని ఆయన అన్నారు. తమ పార్టీని దెబ్బ తీయాలని తప్ప సమస్యను పరిష్కరించాలని కాంగ్రెసుకు లేదని ఆయన విమర్శించారు.

సమస్యను పరిష్కరించకుండా పక్కదారి పట్టించేందుకు కాంగ్రెసు ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. వైయస్ జగన్ జైల్లో దీక్ష చేస్తే హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ప్రభుత్వం తన దీక్షను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆయన విమర్సించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెసును ఎండగట్టేందుకే దీక్ష చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారని, తాము నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ అన్నారు. సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలను రక్షిస్తామని ఆయన మీడియాతో అన్నారు. చంద్రబాబు ఎందుకు దీక్ష చేస్తున్నారనేది ఆశ్చర్యంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మాజీ డిజిపి దినేష్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు. ఇన్ని మాటలు చెబుతున్న దినేష్ రెడ్డి డిజిపిగా ఏం చేశారని ఆయన అడిగారు. పదవీ కాలం పొడిగించనందు వల్లనే దినేష్ రెడ్డి ఆరోపణలు చేశారని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఒత్తిడి తెస్తే దినేష్ రెడ్డి విధులను సక్రమంగా నిర్వహించాల్సి ఉండిందని ఆయన అన్నారు. దినేష్ రెడ్డి ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని దిగ్విజయ్ సింగ్ అన్నారు.












Click it and Unblock the Notifications