తన అరెస్ట్ పై చంద్రబాబు సంచలనం!!
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో పల్లె ప్రగతి కోసం ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంపై ఇప్పులు చెరిగారు. నిప్పులా బతికిన తనపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఒకటి రెండు రోజుల్లో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తనపై కూడా దాడి చేస్తారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని చేసినా, దాడులు చేసినా సరే వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. మహాభారతం, రామాయణంలో ధర్మం గెలిచినట్టు చివరికి మనమే గెలుస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

గతంలో ఎప్పుడూ రాని మెజారిటీ ఈసారి ఎన్నికల్లో వస్తుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ అరాచక పాలన అంతం కోసం ఇంటికొకరు తనతో పాటు ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అంగళ్ళలో తనమీద హత్యా ప్రయత్నం చేసి తనపైనే 307కింద కేసు పెట్టారని చంద్రబాబు పేర్కొన్నారు. అంతేకాదు తామే దాడులు చేసినట్టు ఒత్తిడి చేస్తూ స్టేట్మెంట్లు రాయిస్తున్నారని, కావాలని తప్పుడు కేసులలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
యువగళం పాదయాత్రకు వచ్చి దాడులు చేసి టిడిపి నేతలపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఏపీ సీఎం సైకోలా వ్యవహరిస్తున్నారని, సైకో పాలన నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్న చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం పై తన అసహనాన్ని వ్యక్తం చేశారు.
జగన్ కు బటన్ నొక్కడం ఒక్కటే తెలుసని, అలా ఇచ్చిన డబ్బుల కంటే పేపర్ ప్రకటనలకే ఎక్కువ ఖర్చు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. మొత్తంగా తనని త్వరలోనే అరెస్ట్ చేస్తారంటూ చంద్రబాబు చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి.












Click it and Unblock the Notifications