ఆ ఎమ్మెల్యేలతో అందరికి చెడ్డపేరు - కేబినెట్లో చంద్రబాబు సీరియస్ - కీలక అంశాల లీక్స్ పైనా ..!
ఇవాళ జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు రాష్ట్రంలో కొందరు ఎమ్మెల్యేల తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇసుక వ్యవహారాలకు దూరంగా ఉండాలని ఇప్పటికే ప్రతీ కేబినెట్ భేటీలోనూ పదే పదే చెప్తున్న చంద్రబాబు.. ఇప్పుడు ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై ఫోకస్ పెట్టారు. ఇవాళ కేబినెట్ భేటీలో వారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన చంద్రబాబు మంత్రులకు కీలక సూచన చేశారు.
రాష్ట్ర కేబినెట్ భేటీలో పలువురు కూటమి ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. కొంతమంది ఎమ్మెల్యేల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని మండిపడ్డారు. ఈ విషయంలో మంత్రులు ఎమ్మెల్యేలను గైడ్ చేయాలని చంద్రబాబు సూచించారు. ఇద్దరు ,ముగ్గురు ఎమ్మెల్యేల తో మంచిపేరు దెబ్బ తింటోందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కొందరు ఎమ్మెల్యేల ప్రవర్తన అందరికి చెడ్డపేరు తెస్తోందన్నారు. ఇకనైనా ఆ ఎమ్మెల్యేలు పద్ధతి మార్చుకోవాలని సూచించారు.

అయితే ఈ ఎమ్మెల్యేలు ఎవరన్న దానిపై మాత్రం వివరాలు వెల్లడికాలేదు. నిన్న అనంతపురంలో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మితత్ రెడ్డి ఇసుక లారీల్ని పట్టించినా పోలీసులు కేసులు నమోదు చేయలేదంటూ స్టేషన్ కు వెళ్లి రచ్చ రచ్చ చేశారు. చివరికి సీఐ క్షమాపణ చెప్పే వరకూ ఊరుకోలేదు. ఈ వ్యవహారం ప్రభుత్వాన్ని సైతం ఇరుకునపెట్టింది. దీంతో పాటు తాజాగా జరిగిన మరికొన్ని ఘటనలపై సీఎం చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ప్రభుత్వంలో కీలక మైన సమాచారం బయటకు పొక్కడంపైనా కేబినెట్లో సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులోనూ శ్వేత పత్రాల్లో సమాచారం, ఓటాన్ అకౌంట్ వివరాలు, ఇతర కీలకమైన నిర్ణయాలు బయటకు ఎలా వెళ్లాయయనని బాబు విస్మయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖల్లో వైసీపీ వేగులు ఉన్నారన్న అంశం కేబినెట్ భేటీలో ప్రస్తావనకు వచ్చింది. దీనిపై మంత్రులు కూడా తమ అభిప్రాయాలు చెప్పారు. ఇందులో ప్రభుత్వ శాఖల్లో ప్రక్షాళన అవసరమని కొందరు మంత్రులు సీఎంకు సూచించారు.












Click it and Unblock the Notifications