అవమానాలు గుర్తుకు వచ్చాయి: కంటతడి పెట్టిన చంద్రబాబు, కసితోనే...
విభజన సమయంలో తనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుని చంద్రబాబు కంటతడి పెట్టారు. ఎపి అసెంబ్లీ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనూహ్యంగా ఉద్వేగానికి గురయ్యారు. తన స్వభావానికి విరుద్ధంగా వ్యవహరించారు. విభజన సమయంలో జరిగిన అవమానాలను గుర్తుచేసుకొని ఆయన కంటతడి పెట్టారు. ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక అసెంబ్లీ భవనాన్ని గురువారం ప్రారంభించిన తర్వాత జరిగిన సభలో చంద్రబాబు ఉద్వేగంగా ప్రసంగించారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే కసితో ప్రస్థానాన్ని ప్రారంభించామని చెప్పారు. ఇది తాత్కాలికే అసెంబ్లీ మాత్రమేనని, త్వరలో కొత్త అసెంబ్లీని నిర్మిస్తామని ఆయన చెప్పారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని ఆయన అన్నారు.
రాయలసీమను కోస్తా కన్నా ఎక్కువగా అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. వనరులున్నా అభివృద్ధికి నోచుకోని ప్రాంతం ఉత్తరాంధ్ర అని, ఆ పరిస్థితిని మమారుస్తామని ఆయన చెప్పారు.

అమరావతికి ఇలా వచ్చాం..
కట్టుబట్టలు, అప్పులతో అమరావతికి వచ్చామని, సొంతగడ్డపై అసెంబ్లీ ఏర్పాటు ఓ చరిత్ర అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం వెలగపూడిలో ఏపీ అసెంబ్లీ భవన సముదాయాలను ప్రారంభించిన చంద్రబాబు అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. పొలంలో కొత్త అసెంబ్లీ రూపుదిద్దుకుందని చెప్పారు.

మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత..
రాష్ట్ర స్థాయిలో ఏ శాసనం చేయాలన్నా ఇక్కడి నుంచే చేయాలని, మద్రాస్ నుంచి విడిపోయిన తర్వాత కర్నూలులో గుడారాల్లో పాలన సాగిందని చద్రబాబు చెప్పారు. అలాగే విశాలాంధ్ర ఏర్పాటుతో హైదరాబాద్ చేరామని, 58 ఏళ్ల తర్వాత కట్టుబట్టలు, అప్పులతో అమరావతికి వచ్చామని చెప్పారు.

వారు కూడా వచ్చి ఉంటే బాగుండేది...
అసెంబ్లీ ప్రారంభ కార్యక్రమానికి ఇతర పార్టీల నేతలు కూడా వస్తే బాగుండేదని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రం నడిబొడ్డున రాజధాని ఉండాలనే ఇక్కడికి వచ్చామని చెప్పారు. భూమిపై మమకారం ఉండే ప్రాంతం అయినప్పటికీ రైతులు ముందుకొచ్చి 34వేల ఎకరాలు ఇచ్చారని కొనియాడారు. భూసమీకరణను రాజకీయం చేయాలని చంద్రబాబు అన్నారు.

నాకు హైకమాండ్ లేదు...
తనకు హైకమాండ్ లేదని, తన హైకమాండ్ ప్రజలేనని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానని, అమెరికాలో 14రోజులు తిరిగి ఐటీ కంపెనీలు తెచ్చానని చెప్పారు. భావితరాల భవిష్యత్ కోసమే మైక్రోసాఫ్ట్‌ను హైదరాబాద్ తెచ్చానని, హైదరాబాద్‌లోని పాత అసెంబ్లీ నుంచి తన ప్రయాణం ప్రారంభమైందని చంద్రబాబు అన్నారు.

35 ఏళ్లు హైదరాబాదులోనే....
39ఏళ్లు హైదరాబాద్‌లోనే ఉన్నానని, ఏపీని తిరుగులేని రాష్ట్రంగా, నెంబర్‌వన్‌గా తయారుచేస్తానని చంద్రబాబు చెప్పారు. ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దని ఆయన ప్రతిపక్షాలకు సూచించారు. 192రోజుల్లో అసెంబ్లీ భవనాన్ని నిర్మించామని చెప్పారు. శ్రీశైలంలో తొలిసారి మంచి నీటిమట్టాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు . పోలవరం కోసం ప్రతి సోమవారం పర్యవేక్షిస్తున్నామని, ప్రతి సోమవారం నీరు ప్రగతి కింద టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామని, ప్రతి బుధవారం అమరావతిపై సమీక్ష నిర్వహిస్తున్నానని ఆయన వివరిచారు.

మైకులు విరగ్గొట్టలేరు.. స్పీకర్‌పై దాడి చేయలేరు...
ప్రస్తుతం నిర్మించిన అసెంబ్లీలో మైకులు విరగొట్టలేరు.. అసెంబ్లీ స్పీకర్‌పై దాడి చేయలేరని చంద్రబాబు అన్నారు. ఆవేశాలు వేరు అసెంబ్లీలో ప్రవర్తన వేరని అన్నారు. అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పవచ్చునని, ప్రజలు ఎవరి మాట నమ్మితే వారితో వుంటారని అన్నారు. అంతేగానీ ఇష్టానుసారంగా చేస్తే సమస్యలు వస్తాయని ఆయన అన్నారు.

కష్టపడి పనిచేస్తా... రెచ్చగొట్టినా కూడా...
రెండేళ్లలో ఎప్పుడూ జరగని అభివృద్ధి జరుగుతుందని చంద్రబాబు అన్నారు. 2029 నాటికి భారత్‌లో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తాను ఇష్టపడి.. కష్టపడి పనిచేస్తాను.. ఎవరు రెచ్చగొట్టినా ప్రజల కోసం భరిస్తున్నానని ఆయన చెప్పారు. భవిష్యత్తులో రాష్ట్రంలో కరెంటు కోత ఉండదని, డబుల్ డిజిట్ గ్రోత్ సాధించిన ఏకైక రాష్ట్రం ఇది అని ఆయన అన్నారు. రాష్ట్రానికి పలు అంశాల్లో అవార్డులు వచ్చాయని ఆయన గుర్తు చేశారు.

ఫైళ్లు మోసుకుని, కాలినడకన తిరిగా...
ఫైళ్లు మోసుకుని కాలినడకన తాను పెట్టుబడుల కోసం తిరిగినట్లు చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర విభజన చాలా బాధాకరమని, ఎవరినీ అడగకుండా అరగంటలో విభజించారని ఆయన అన్నారు. జరిగిన అన్యాయాన్ని అభివృద్ధితో పూడ్చగలం గానీ అవమానాన్ని మరువలేమని అన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తీరుతో తన జీవితంలో ఎన్నడూ పడని ఆవేదన అనుభవించినట్లు తెలిపారు. విభజన నాటి కసి, కోపం తగ్గడానికి వీలు లేదని అన్నారు. దాని నుంచే అభివృద్ధి చేసి తీరాలని చెప్పారు.












Click it and Unblock the Notifications