బిజెపి క్లియర్: తేల్చుకోవాల్సింది చంద్రబాబే, మరి పవన్ కల్యాణ్....?
విజయవాడ: ప్రత్యేక హోదాపై బిజెపి తన వైఖరిని స్పష్టం చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కోరికలన్నింటినీ తీర్చలేమని తేల్చేసింది. బిజెపి ఆంధ్రప్రదేశ్ ఇంచార్జీ సిదార్థనాథ్ సింగ్ చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వంపై చేస్తున్న వ్యాఖ్యలను తిప్పికొట్టారు.
సిద్ధార్థసింగ్ మాటలను బట్టి ఇక చంద్రబాబు మాత్రమే బిజెపితో సంబంధాలను తేల్చుకోవాల్సిన పరిస్థితిలో పడ్డారు. తమ ఇంటికి నెలకు 10 వేల రూపాయలు అవసరం పడితే, తన సంపాదన నుంచి గానీ తన భార్య సంపాదన నుంచి గానీ ఖర్చు చేసుకుంటాం తప్ప పొరుగువారిని ఇవ్వమంటే ఎలా అని సిద్ధార్థ సింగ్ అన్నారు.
చంద్రబాబు కోరినవన్నీ ఇవ్వలేమని సిద్ధార్థ సింగ్ చాలా స్పష్టంగానే చెప్పారని అనుకోవాలి. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశం లేదు కాబట్టి తాము ఇవ్వలేమని కూడా ఆయన చెప్పారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వబోదని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి చాలా కాలంగా చెబుతూనే ఉన్నారు. అంతేకాకుండా, ఆ విషయం చంద్రబాబుకు కూడా తెలుసునని అన్నారు.

చంద్రబాబు కూడా ప్రత్యేకంగా పట్టింపుతో ఉన్నట్లు లేరు. ప్రత్యేక హోదా వల్ల ఒరిగేదేమీ ఉండదనే పద్ధతిలో ఓసారి మాట్లాడారు. ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు అడగలేదా అని మీడియా ప్రతినిధులు శుక్రవారంనాటి మీడియా సమావేశంలో అడిగితే తన నోటితో ఎందుకు చెప్పిస్తారని సిద్ధార్థనాథ్ అన్నారు. దీన్నిబట్టి చంద్రబాబు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని అడిగిన దాఖలాలు లేవని అనిపిస్తోంది.
అయితే, ఇంతకాలం ప్రత్యేక హోదా అంశంపై కేంద్రాన్ని తొందరపెట్టాల్సిన అవసరం లేదని, ప్రధాని నరేంద్ర మోడీ ఆ విషయాన్ని పరిశీలిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు బిజెపి రాష్ట్ర నాయకులు కూడా చెబుతూ వచ్చారు. కానీ, ప్రత్యేక హోదా ఇవ్వడం లేదనే విషయాన్ని బిజెపి శషబిషలు లేకుండా తేల్చేసినట్లే భావించాలి.
అయితే, ప్రత్యేక హోదాపై ఇంకా చంద్రబాబు కేంద్రం పేరు చెప్పి సమయాన్ని దాటవేయలేని పరిస్థితిలో పడ్డారు. బిజెపి కూడా వ్యూహాత్మకంగా ఒక్కొక్క పేజే తిప్పేసినట్లు పుస్తకం తెరిచేసి మూసేసింది. అందువల్ల చంద్రబాబు స్పష్టంగా ప్రత్యేక హోదాపై ముందుకు రావాల్సే ఉంటుంది. ప్రత్యేక హోదా కన్నా ఎక్కువే కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందని ఆయన చెప్పదలుచుకుంటే మాత్రం రాజకీయంగా ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది.
ప్రత్యేక హోదా వల్ల కలిగే లాభాలేమిటో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వివరించి చెప్పే ప్రయత్నాలు చేశారు. ప్రత్యేక హోదా కోసం ఆయన ఆందోళనలకు కూడా దిగారు. రాజకీయంగా అది చంద్రబాబుపై ఒత్తిడి పెంచిందనే చెప్పాలి. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్ర మంత్రి వర్గం నుంచి తన మంత్రులను ఉపసంహరించుకోవాలని జగన్ చంద్రబాబును డిమాండ్ చేస్తూ వస్తున్నారు.
కేంద్ర మంత్రివర్గం నుంచి టిడిపికి చెందిన ఇద్దరు మంత్రులను ఉపసంహరించుకుంటే బిజెపితో దాదాపుగా టిడిపి సంబంధాలు తెగిపోయినట్లే. అంత సాహసానికి చంద్రబాబు ఒడిగడుతారా అనేది ఓ ప్రశ్న అయితే, ప్రస్తుతం ఎదరువుతున్న సవాల్‌ను ఎలా అధిగమిస్తారనేది మరో ప్రశ్న. ఇప్పటికిప్పుడైతే బిజెపికి, టిడిపికి మధ్య సంబంధాలు బీటలు వారినట్లే కనిపిస్తోంది.
ఇదిలావుంటే, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కూడా ఒత్తిడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రత్యేక హోదాపై కొంత కాలం ఆగుదామని పవన్ కల్యాణ్ ఒకానొక సందర్భంలో అన్నారు. వేచి చూడడానికి బిజెపి ఇక ఏమీ మిగిలించలేదు. ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదనే విషయాన్ని స్పష్టం చేసింది. అందువల్ల పవన్ కల్యాణ్ ఎలా ముందుకు వస్తారనేది కూడా ఆసక్తికరమైన విషయమే.












Click it and Unblock the Notifications