మోడీ గెలుపే మన గెలుపు- త్వరలో హైకోర్టు బెంచ్- కర్నూలు సభలో బాబు.. !
మోదీ విజయం భారత్ విజయమని, అదే మన విజయమని సీఎం చంద్రబాబు ఇవాళ ప్రకటించారు. 21వ శతాబ్దం నరేంద్ర మోదీదేనన్నారు. కేంద్ర సహకారంతో రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు వస్తున్నట్లు ఆయన తెలిపారు. కర్నూలులో నిర్వహించిన జీఎస్టీ 2.0 ఉత్సవ్ సభలో ప్రధాని మోడీతో కలిసి పాల్గొన్న చంద్రబాబు.. రూ.13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. త్వరలోనే రాయలసీమకు హైకోర్టు బెంచ్ వస్తుందని బాబు ప్రకటించారు.
కేంద్రంలో రాష్ట్రంలోని ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కార్ తో ఆంధ్రప్రదేశ్ కు రెట్టింపు ప్రయోజనాలు దక్కుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. జీఎస్టీ 2.0 సంస్కరణలతో దేశ ప్రగతి వేగాన్ని పెంచటంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. ముఖ్యమంత్రిగా, ప్రధానిగా 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. అత్యంత అంకిత భావంతో దేశానికి సేవలు అందిస్తున్న మోదీ ఓ విశిష్టనేత అని కొనియాడారు. సరైన సమయంలో సరైన చోట సరైన నేతగా ప్రధాని స్థానంలో మోదీ ఉన్నారని.. ఆయన 21 వ శతాబ్దపు నేత అని కితాబిచ్చారు.

ఎలాంటి విరామం లేకుండా ప్రజల సేవలోనే ఆయన అంకితమై ఉన్నారని.. తాను చూసిన ప్రధానుల్లో మోదీ అత్యంత ప్రగతిశీల నేత అని అన్నారు. దేశ అభివృద్ధి కోసం ఆయన కీలకమైన సంస్కరణలు తీసుకువచ్చారని తద్వారా ప్రపంచవ్యాప్తంగా భారత్ అగ్రస్థానానికి చేరుకుంటోందని అన్నారు. 11 ఏళ్ల క్రితం 11వ స్థానంలో ఉన్న భారతదేశం ప్రధాని మోదీ సంకల్పంతో ఇప్పుడు 4వ స్థానానికి చేరిందన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా 2047కు దేశం సూపర్ పవర్ గా మారుతుందని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా సైనిక పరంగా భారతదేశ సత్తాను ప్రపంచానికి చాటేలా చేశారన్నారు.
జీఎస్టీ పన్ను విధానంలో ప్రస్తుత సంస్కరణల వల్ల 99 శాతం వస్తువులు సున్నా నుంచి 5 శాతం పన్ను పరిధిలోకి వచ్చాయని.. తద్వారా అన్ని వస్తువుల ధరలు తగ్గాయని సీఎం అన్నారు. జీఎస్టీ 2.0తో పన్నులు తగ్గి పేదలు, మధ్యతరగతికి గణనీయంగా ఉపశమనం కలిగిందని అటు వ్యాపారులు, ఎంఎస్ఎంఈ వర్గాలకూ ప్రయోజనం చేకూరుతోందని స్పష్టం చేశారు. విద్యార్థులు, రైతులు, చిరుద్యోగులు, చిరు వ్యాపారులు, వృద్ధులు, కూలీలు, కార్మికులు ఇలా అన్ని వర్గాలకు లబ్ది కలిగించేలా సంస్కరణలు ఉన్నాయని పేర్కొన్నారు. జీఎస్టీ తగ్గింపుతో ప్రతీ కుటుంబానికీ రూ.15 వేల వరకూ ఆదా అవుతుందన్నారు.

ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తున్న టారిఫ్ లను ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ ఇచ్చిన స్వదేశీ పిలుపే తారకమంత్రం అవుతుందని సీఎం అన్నారు. ఈ స్వదేశీ పిలుపును అందిపుచ్చుకుని సెమీ కండక్టర్ల నుంచి శాటిలైట్ల వరకూ చిప్ ల నుంచి షిప్పుల వరకూ ఏపీలోనే ఉత్పత్తి చేసేలా కార్యాచరణ చేపట్టామని అన్నారు. రాష్ట్రంలో విద్యుత్, రైల్వే, జాతీయ రహదారులు, పారిశ్రామిక, రక్షణ రంగాలకు చెందిన రూ. 13,429 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం చుట్టారు. వర్చువల్ విధానం ద్వారా వివిధ ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. అలాగే ఇంకొన్నింటిని శంకుస్థాపనలు చేశారు. మరో రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.












Click it and Unblock the Notifications