ఒకవేళ చంద్రబాబు విడుదల అయినా..
అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.
2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, డొల్ల కంపెనీలను సృష్టించి, ముడుపులను పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. దీనిపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.

వివిధ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటీషన్లను ఏపీ హైకోర్టు కొట్టి పడేసింది. వాటన్నింటినీ డిస్మిస్ చేసింది. అంటే- స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో ఒకవేళ చంద్రబాబు విడుదలయినా.. ఈ మూడు కేసుల్లో ఏదో ఒకదాంట్లో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం పోలీసులకు ఉంది.
రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో అలైన్‌మెంట్ మార్పు- అందులో పెద్ద ఎత్తున అవకతవకలకు పూనుకోవడంపై చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని అంగళ్లు వద్ద పోలీసులపై దాడికి పాల్పడటం, వారిని గాయపర్చడం, వాహనాలను తగులబెట్టడం.. అక్కడ పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగడానికి కారణం అయ్యారనే ఉద్దేశంతో పోలీసులు ఇదివరకే జారీ చేసిన నోటీసులపైనా చంద్రబాబుకు చుక్కెదురైంది.
ఈ కేసులో కూడా ఆయనకు ఊరట దక్కలేదు. అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ను కూడా ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. కోట్ల రూపాయల మేర అవినీకి పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్న ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలోనూ ముందస్తు బెయిల్ దక్కలేదు చంద్రబాబుకు.
ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ అరెస్ట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఈ మూడు ముందస్తు బెయిల్ పిటీషన్లు డిస్మిస్ కావడంపై చంద్రబాబు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాదులు త్వరలోనే సుప్రీంకోర్టులో అప్పీల్ పిటీషన్లు దాఖలు చేస్తారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications