ఉచిత బస్సెక్కి మహిళలు, రైతులతో చంద్రబాబు ఆసక్తికర సంభాషణ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఆగస్టు 15వ తేదీ నుంచి కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్న వేళ మహిళల సౌకర్యార్థం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా కుప్పంలో స్త్రీశక్తి బస్సులో ప్రయాణించి బస్సులో మహిళలతో మాట్లాడారు.ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పైన వారినడిగి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

స్త్రీశక్తి బస్సులో ప్రయాణించిన ఏపీ సీఎం చంద్రబాబు
కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించిన సీఎం చంద్రబాబు కుప్పానికి హంద్రీనీవా ద్వారా కృష్ణ నీళ్లు అందించారు కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు జల హారతి ఇచ్చే కార్యక్రమానికి ముందు చంద్రబాబు మహిళలు, రైతులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ వరకు మహిళలు, రైతులతో సంభాషిస్తూ బస్సులో ప్రయాణం చేసిన చంద్రబాబు ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు.

ఉచిత బస్సుపై చంద్రబాబు ప్రశ్న.. మహిళల ఆసక్తికర సమాధానం
స్త్రీ శక్తి పేరుతో అందిస్తున్న ఉచిత బస్సు సదుపాయం ఎలా ఉందని మహిళలను అడిగి తెలుసుకున్న చంద్రబాబు మహిళలు ఇచ్చిన సమాధానానికి సంతృప్తి చెందారు. ఫ్రీ బస్సు సేవలు తమకు బాగా ఉపయోగపడుతున్నాయని, తాము ఎక్కడికి వెళ్లినా ఇబ్బంది లేకుండా... ఫ్రీ బస్సులో వెళ్తున్నామని మహిళలు చెప్పారు. చక్కటి సదుపాయాన్ని కల్పించారని.. తమకు డబ్బులు ఆదా అవుతున్నాయని సీఎంతో బస్సులో ప్రయాణం చేసిన మహిళలు పేర్కొన్నారు.

కుప్పానికి కృష్ణా నీళ్ళు రావటంపై రైతులతో మాట్లాడిన చంద్రబాబు
ఇదే సమయంలో హంద్రీ-నీవా ద్వారా కృష్ణా నీళ్లు తొలిసారి కుప్పానికి వచ్చాయి.. కాల్వల్లో నీళ్లు చూశారా..? చెరువులు నిండాయా అంటూ చంద్రబాబు బస్సులో ఉన్న రైతులను ఆరా తీశారు.తొలిసారి కుప్పానికి కృష్ణమ్మ వచ్చిందని... చాలా సంతోషంగా ఉందని చెప్పిన రైతులు, మహిళలు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన చంద్రబాబు
అనంతరం కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కు చేరుకున్న చంద్రబాబు కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు జల హారతి ఇచ్చి అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను సందర్శించారు. ఆపై హంద్రీనీవా కెనాల్ విస్తరణ పనుల పైలాన్ ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.












Click it and Unblock the Notifications