కార్నర్ ఎవరో: జగన్‌పార్టీలో అసంతృప్తి, టీడీపీ బెదిరింపు!
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఓ వైపు అసంతృప్తులు కనిపిస్తుండగా.. మరోవైపు అధికార తెలుగుదేశం పార్టీ హెచ్చరికలు జారీ చేస్తోంది! వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చాలామందిలో పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన అసంతృప్తి లేకపోయినప్పటికీ.. స్థానిక కారణాలతో ఇబ్బందులకు గురవుతున్నారట. రెండు రోజుల క్రితం కొత్తపల్లి గీత తన అసంతృప్తిని వెళ్లగక్కిన విషయం తెలిసిందే.
పార్టీలో మహిళలకు ప్రాధాన్యత లేదని, విశాఖ, విజయనగరం జిల్లాల పార్టీ నేతలు తనను పార్టీ కార్యక్రమాల్లో కలుపుకు పోవడం లేదని, జగన్ జిల్లా పర్యటనలకు వచ్చినప్పుడు తనకు సమాచారం ఇవ్వడం లేదని కొత్తపల్లి గీత ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, తనకు ఉన్నఫళంగా పార్టీ మారే ఆలోచన లేదని చెప్పారు. అంతేకాదు, కారణమేదైనా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఏకంగా జగన్ పార్టీ సాక్షి పత్రిక పైన మండిపడ్డారు.
ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి షాకిచ్చారు. బుట్టా రేణుక కూడా టీడీపీకి అనుబంధంగా ఉందామని తొలత నిర్ణయించుకున్నప్పటికీ.. ఆ తర్వాత వెనక్కి తగ్గారు. తనకు రాజకీయాల్లో అంతగా అనుభవం లేకపోవడం వల్లనే ఇలా జరిగిందని ఆమె వివరణ ఇచ్చుకున్నారు. తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో చాలామంది సభ్యులు టీడీపీకి మద్దతు పలికారు. అయితే, ముఖ్యనేతలు ఎవరు పార్టీ మారే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు.

వైయస్ జగన్
సార్వత్రిక ఎన్నికలకు ముదు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ సహా ఆ పార్టీ అంతా బలంగా నమ్మింది. కానీ అది రివర్స్ అయింది.

వైయస్సార్ కాంగ్రెస్
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడగానే వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి బలమైన దెబ్బ తగిలింది. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి టీడీపీలో చేరారు. ఇటీవలీ స్థానిక పరోక్ష ఎన్నికల్లోను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి గెలిచిన వారు టీడీపీకి మద్దతు పలికారు. అయితే, కొందరు ముఖ్యనేతలు స్థానిక కారణాలతో అసంతృప్తితో ఉన్నారట. జగన్ పైన అసంతృప్తి లేదట. ఈ నేపథ్యంలో నేతలు ఎవరు పార్టీ మారే అవకాశాలు లేదు.

టీడీపీ
అధికార తెలుగుదేశం పార్టీ మాత్రం తమ పార్టీలోకి పలువురు వస్తారని మొదటి నుండి భావిస్తోంది. కొన్నాళ్ల తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఖాళీ కావడం ఖాయమని టీడీపీ నేతలు కొద్ది రోజుల క్రితం చెప్పారు. తాజాగా.. కొందరు నేతలు పదే పదే జగన్ ఆస్తుల కేసు అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. జగన్ ఎన్నికలు వస్తే తామే అధికారంలోకి వస్తామని చెప్పడంతో.. పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. జగన్ ఎన్నికల గురించి మాట్లాడటం పక్కన పెట్టి తమ ప్రజాప్రతినిధులను కాపాడుకోవడంపై దృష్టి సారించాలన్నారు.

జగన్, చంద్రబాబు
అధికారంలో ఉన్న చంద్రబాబు వైయస్సార్ కాంగ్రెసు పార్టీని కార్నర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో జగన్ హామీల పైన నిత్యం నిలదీస్తూ టీడీపీని కార్నర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా జగన్ రుణమాఫీ పైన కార్యాచరణకు సిద్ధమవుతున్నారట. రుణమాఫీ చంద్రబాబుకు చాలా ముఖ్యమైన హామీ. దీనిని నిలబెట్టుకోకుంటే ఏపీ వ్యాప్తంగా తీవ్ర నిరసనలకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రణాళికలు తయారు చేసుకుంటోందట. ఇప్పటికే జగన్.. రుణమాఫీ హామీ నెరవేర్చకుంటే తాము రైతులతో కలిసి ఉద్యమిస్తామని చెప్పిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. అధికార టీడీపీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీని బలహీనపర్చే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా జగన్ ఆస్తుల కేసు అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుండి టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. జగన్ ఎప్పటికైనా జైలుకు వెళ్లక తప్పదని, ఆ పార్టీలోని నేతలు భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలన్న రీతిలో మొదటి నుండి మాట్లాడుతోంది. అయితే, ఇది ఒకవిధంగా భయపెట్టే చర్యగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భావిస్తోంది.
మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆదివారం కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రతిపక్ష నాయకుడిగా విఫలమయ్యారని, ఆయన తన ఎమ్మెల్యేలను, ఎంపీలను కాపాడుకోవాలని సూచించారు. ఇప్పటికే తమ పార్టీ నేతలకు టీడీపీ గాలం వేస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆరోపిస్తోంది. ఇలాంటి సమయంలో జగన్ తన ఎమ్మెల్యేలను, ఎంపీలను కాపాడుకోవాలని పత్తిపాటి హితవు పలికారు. అంతేకాదు జగన్ పైన అనేక కేసులు ఉన్నాయని గుర్తు చేశారు.
అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా టీడీపీని ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తోంది. రుణమాఫీ అంశం విషయంలో జగన్ పెద్ద ఎత్తున నిరసన చేపట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. రుణమాఫీ పైన చంద్రబాబు వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తో రైతులతో కలిసి ఉద్యమం చేసేందుకు తాము సిద్ధమని జగన్ ఇటీవల జిల్లా పర్యటనలో చెప్పారు. చంద్రబాబుకు రుణమాఫీ చాలా ముఖ్యమైన విషయం. ఈ నేపథ్యంలో జగన్ పార్టీ దాని కోసం కాచుక్కూచుందంటున్నారు. మిగిలిన హామీల పైన జగన్ ప్లాన్‌తో ఉన్నారట.












Click it and Unblock the Notifications