పోలవరంలో చంద్రబాబు-పనుల పూర్తికి ఇవాళ షెడ్యూల్ రిలీజ్..!
ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ఇవాళ సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుకు వెళ్లారు. గత వైసీపీ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు పనుల్ని నిలిపేశారు. డ్యామ్ నిర్మాణంలో సాంకేతిక తప్పిదాలతో ప్రాజెక్టు నిర్మాణం నిలిచిపోయింది. వాటిని సరిదిద్దేందుకు ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం విదేశీ నిపుణుల్ని పిలిపించి రిపోర్టు తీసుకుంది. దీని ఆధారంగా పనుల్ని త్వరలో పునఃప్రారంభించబోతున్నారు.
ఇవాళ పోలవరం ప్రాజెక్టుకు వెళ్లిన సీఎం చంద్రబాబు వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టు పరిస్ధితి, పనుల పురోగతిని అధికారుల్ని అడిగి తెలుసుకుంటారు. అనంతరం తదుపరి చేపట్టాల్సిన పనులపై ఇంజనీర్లు, అధికారులతో అక్కడే రివ్యూ నిర్వహిస్తారు. ఆ తర్వాత సాధ్యమైనంత ప్రాజెక్టు పూర్తి చేసేందుకు వీలుగా పనుల షెడ్యూల్ ను అక్కడే ప్రకటించబోతున్నారు. ఇందులో డయాఫ్రం వాల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్, ఇతర నిర్మాణ పనులు ఉండబోతున్నాయి. వీటిని ఎప్పుడెప్పుడు పూర్తి చేయాలన్నది ఇందులో ఉండబోతోంది.

గతంలో సీఎంగా ఉండగా చంద్రబాబు పోలవరానికి ప్రతీ సోమవారం వెళ్లేవారు. అయితే పనులు మూడొంతులు పూర్తయిన తర్వాత ప్రభుత్వం మారిపోవడంతో అవన్నీ అలాగే నిలిచిపోయాయి. దీంతో ఇప్పుడు తాజా పరిస్ధితిని పరిశీలించి పనుల పూర్తికి షెడ్యూల్ విడుదల చేసేందుకు చంద్రబాబు సిద్దమయ్యారు. రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. కేంద్రం నుంచి సహకారం అందుతున్న నేపథ్యంలో ఇది అసాధ్యం కూడా కాదని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications