మీరు స్పందించాలి, సమన్యాయం చేశాకే: ప్రణబ్‌కు బాబు
హైదరాబాద్: విభజనపై కాంగ్రెసు పార్టీ ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా వెళ్తోందని, సమన్యాయం చేసిన తర్వాత విభజన చేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి మంగళవారం సుదీర్ఘ లేఖ రాశారు. విభజన పైన కనీస సంప్రదాయాలను పాటించడం లేదని, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను అడిగినా స్పందించడం లేదని విమర్శించారు.
కేంద్రమంత్రులు ప్రజలను గందరగోళంలోకి నెడుతున్నారని విమర్శించారు. గతంలో ఎన్డీయే సామరస్యంగా మూడు రాష్ట్రాలను విభజించిందని, ఇప్పుడు కూడా అలాగే జరగాలన్నారు. విభజన అంశంలో ఉభయ ప్రాంతాల ఐకాసలు, ప్రభావిత వర్గాల వారితో చర్చల ప్రక్రియ మొదలుపెట్టేలా కేంద్ర ప్రభుత్వానికి మార్గనిర్దేశకత్వం చేయాలని రాష్ట్రపతిని కోరారు.

రాష్ట్ర విభజన అంశంలో రాజ్యాంగ నియమాలు, గతంలో పాటించిన సంప్రదాయాలను గౌరవించాలని, ఇరు ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు, విద్యార్థులు, రైతులకు సంబంధించిన ఐకాసలను పిలిచి సమస్యాత్మక అంశాలపై విపులంగా చర్చించాలని, ఇతర ప్రభావిత వర్గాల మనోగతాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొన్న తర్వాతే ముందుకు వెళ్లాలని కోరారు.
ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటుకు ముందు కూడా ఉభయ ప్రాంతాల అసెంబ్లీలు తీర్మానాలు చేసిన తర్వాతే ప్రక్రియ మొదలైందని, అప్పటి ప్రధాని చొరవ తీసుకొని ఈ ప్రక్రియ శాంతియుతంగా పూర్తి కావడానికి కృషి చేశారని కానీ, ఇప్పుడు అటువంటి చొరవ కేంద్రంలో లోపించిందని, గతంలోని సంప్రదాయాలకు భిన్నంగా ఇప్పుడు జరుగుతున్న తంతును దేశం దృష్టికి తేవడానికి తాను స్వయంగా ఢిల్లీలో దీక్ష చేశానని అయినా కేంద్రం పట్టించుకోలేదన్నారు.
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామ్య వైఖరి దేశ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఈ అంశాన్ని సున్నితంగా పరిష్కరించే బదులు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలు అడ్డగోలు ప్రకటనలు చేసి రాష్ట్రాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టారని ఆయన ఆరోపించారు. వీరి ప్రకటనలు ఉభయ ప్రాంతాల ప్రజల మధ్య అప నమ్మకాన్ని, గందరగోళాన్ని పెంచి పోషించాయన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉభయ ప్రాంతాల వారితో మాట్లాడటం మరింత ఆవశ్యకంగా మారిందని వివరించారు.
కేంద్రం గత ఆరేళ్లలో నాలుగు కమిటీలు వేస్తే అందులో రెండు కమిటీలు ఏ నివేదికలూ ఇవ్వలేదని, శ్రీకృష్ణ కమిటీ నివేదికను కేంద్రం పట్టించుకోలేదన్నారు. ఆంటోనీ కమిటీ ఇటీవలే తన నివేదికను ఇచ్చిందని పత్రికల్లో వార్తలు వస్తున్నాయని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. అయితే, కమిటీ తన నివేదిక ఇవ్వక ముందే మంత్రివర్గం విభజనకు నిర్ణయం తీసుకోవడం విచిత్రమని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న పరిస్ధితుల్లో ఇరు పక్కలా ఆందోళన చేస్తున్నవారితో విపులంగా చర్చలు జరపకుండా విభజన అంశంపై చెలరేగిన మంటలను ఆర్పడం కష్టమన్నారు.












Click it and Unblock the Notifications